క్రికెట్లో అరంగేట్రం చేసిన ప్రతీ ఆటగాడు మొదటి మ్యాచ్‌లోనే తన సత్తా చాటాలని ఉవ్విళ్లురుతుంటాడు. అది బ్యాట్స్‌మెన్ అయితే పరుగుల వరద పారించాలని.. బౌలర్ అయితే వికెట్ తీయాలనే ఆశతో ఉంటాడు. కానీ అరంగేట్రం మ్యాచ్‌లోనే అది అందరికి సాధ్యపడకపోవచ్చు. కొందరికి మాత్రం అది సత్ఫలితాన్ని ఇస్తుంది. ఆ కొందరికి చెందినవాడే టి. నటరాజన్.
బుధవారం కాన్బెర్రా వేదికగా ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో అరంగేట్రం మ్యాచ్‌లోనే నటరాజన్ మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్ మార్నస్ లబుషేన్‌ను బౌల్డ్ చేయడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో తొలి వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సందర్భంగా నటరాజన్ సెలబ్రేట్ చేసుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నటరాజన్ అంతలా వైరల్ కావడం వెనుక బలమైన కారణం ఉంది.ఎక్కడో చెన్నైలోని మారుమూల గ్రామంలో కడు పేదరికం నుంచి వచ్చిన నటరాజన్ ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు అనుభవించాడు. అన్ని అడ్డంకులు దాటుకొని ఇవాళ టీమిండియా తరపున ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆడాలనే తన కలను నెరవేర్చుకున్నాడు.
పైగా అరంగేట్రం మ్యాచ్‌లోనే రెండు వికెట్లు తీసి తన ఆరంభాన్ని ఘనంగా చాటాడు.అలా అని దాన్ని గొప్ప ప్రదర్శన అని చెప్పలేం. మొత్తం 10 ఓవర్ల కోటా వేసిన నటరాజన్ 70 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.. కాగా నటరాజన్ బౌలింగ్‌లో ఒక మెయిడెన్ ఓవర్ ఉండడం విశేషం. తమిళనాడులోని సేలం సమీపంలోని చిన్నపంపట్టి గ్రామం నుంచి వచ్చిన టి. నటరాజన్ అంచెలంచెలుగా ఎదిగి ఐపీఎల్‌కు ఎంపికయ్యాడు.
కాగా ఐపీఎల్ 13వ సీజన్లో సన్‌రైజర్స్ తరపున ప్రాతినిధ్యం వహించిన టి. నటరాజన్ యార్కర్ల స్పెషలిస్ట్‌గా ముద్రపడ్డాడు. నటరాజన్ తన లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలింగ్‌తో లీగ్‌లో 16 వికెట్లు తీసి ఆకట్టుకొని టీమిండియా జట్టుకు ఎంపికయ్యాడు. కాగా తొలి రెండు వన్డేల ఓటముల అనంతరం టీమిండియా సెలక్షన్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. సైనీ స్థానంలో నటరాజన్‌ను ఆడించే ఉంటే ఫలితం వేరేలా ఉండేదని చాలా మంది అభిప్రాయపడ్డారు