Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పక్కింటివారిని భార్య ప్రవర్తన గురించి అడిగి తెలుసుకోవడం, భార్య కాల్ డేటా చెక్ చేయడం, ఆమె ఎక్కడికి వెళ్లినా అనుసరించడం… ఇవన్నీ సామాన్యులకే పరిమితం అనుకుంటే పొరపాటే. వివాహ బంధాలకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వరనుకునే సినీ సెలబ్రిటీల్లోనూ ఇలాంటి జాడ్యాలు చాలానే ఉన్నాయి. బాలీవుడ్ లో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోన్న కాల్ డేటా రికార్డ్ స్కామే ఇందుకు నిదర్శనం. ఈ స్కామ్ లో మొదటగా వినిపించిన పేరు నవాజుద్దీన్ సిద్దిఖీ. ఏ పాత్ర చేస్తే ఆ పాత్రలో ఇమిడిపోయే నవాజుద్దీన్… భర్త పాత్రలో మాత్రం జీవించలేకపోతున్నాడు. ఓ సెలబ్రిటీ అయ్యుండి కూడా నవాజుద్దీన్ వ్యవహరించిన తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయింది. నిజానికి సామాన్య జనంతో పోలిస్తే సెలబ్రిటీలు కాస్త మెచ్యూర్డ్ గా వ్యవహరిస్తారని భావిస్తుంటాం. కానీ నవాజుద్దీన్ తాను నటించే క్యారెక్టర్స్ లో తప్ప, తనలో పరిణితి లేదని నిరూపించుకున్నాడు. సాధారణ వ్యక్తుల కన్నా హేయంగా ప్రవర్తించాడు.
సగటు మగవాళ్లు భార్యపై అనుమానమొస్తే… ఆమె ఫోన్ చెక్ చేయడం, ఆమె కదలికలను గమనించడం వరకే సరిపెడతారు. అంతకన్నా వారు చేయగలిగింది ఏమీ ఉండదు. కానీ నవాజుద్దీన్ సెలబ్రిటీ కాబట్టి… తన పలుకుబడి, హోదాను ఇందుకు ఉపయోగించాడు. భార్యపై అనుమానంతో ఆమెపై నిఘాకు ఓ ప్రయివేట్ డిటెక్టివ్ ను నియమించాడు. అంతటితో ఆగకుండా.. రిజ్వాన్ సిద్ధిఖీ అనే లాయర్ కి ఆమె ఫోన్ నెంబర్ ఇచ్చి… కాల్ డేటా రికార్డులు నవాజుద్దీన్ సంపాదించాడు. ఈ నేపథ్యంలో రిజ్వాన్ సిద్దిఖీని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఈ విషయం వెలుగుచూసింది. అయితే ఈ మొత్తం ఘటనలో ట్విస్ట్ ఏమిటంటే… నవాజుద్దీన్ భార్యపై అనుమానంతో చట్టవ్యతిరేక కార్యక్రమానికి పాల్పడితే… నవాజుద్దీన్ భార్య అంజలి మాత్రం ఆయనకు అండగా నిలబడడం.
తన భర్త దేవుడని, మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తమని సోషల్ మీడియాలో ప్రకటన చేసింది. గతంలో తమపై విడాకులు తీసుకుంటున్నారని వార్తలొచ్చాయని, ఇప్పుడు ఇలాంటి వార్తలొస్తున్నాయని, తన భర్తను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్ధం కావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తంచేసింది.తాను బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయినని, నవాజుద్దీన్ ముస్లిమ్ అని, మతాంతర వివాహం చేసుకున్న తాము ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నామని అంజలి తెలియజేసింది. అంజలి చెప్పేది నిజమో… నవాజుద్దీన్ పై వచ్చిన ఆరోపణలు నిజమో మరికొన్నిరోజుల్లో తేలనుంది.
ఈ సంగతి పక్కనపెడితే కాల్ డేటా రికార్డ్ స్కాం బాలీవుడ్ లో నవాజుద్దీన్ తో ఆగిపోలేదు. మరికొందరికి ఇందులో ప్రమేయమున్నట్టు వార్తలొస్తున్నాయి. రిజ్వాన్ సిద్దిఖీని పోలీసులు విచారించిన సమయంలో ప్రముఖ నటుడు జాకీషరాఫ్ భార్య అయేషా, హీరోయిన్ కంగనా రనౌత్ పేర్లు బయటపడ్డాయి. దీంతో వారిద్దరికీ నోటీసులు జారీచేశామని థానే క్రై బ్యాంచ్ డిప్యూటీకమిషనర్ అభిషేక్ త్రిముఖి తెలిపారు. హృతిక్ రోషన్ తో విభేదాల నేపథ్యంలో కంగన ఆయన ఫోన్ నెంబర్ రిజ్వాన్ కు ఇచ్చి కాల్ డేటా అడిగినట్టు సమాచారం. దీనిపై కంగన సోదరి రంగోలీ ట్విట్టర్ లో స్పందించింది. సరైన విచారణ జరపకుండా ఆరోపణలు చేయడం తగదని, హృతిక్ విషయంలో కంగనకు నోటీసులు వచ్చినప్పుడు ఆధారాల కోసం వివరాలు ఇచ్చామని, ఈ ఒక్క విషయాన్ని పట్టుకుని నటి పరువు తీయడం సబబు కాదని ఆగ్రహం వ్యక్తంచేసింది. మొత్తానికి నవాజుద్దీన్ చేసిన పని బాలీవుడ్ లోగుట్టులెన్నింటినో బయటకు తెస్తోంది.