Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సినిమాల్లోకి వచ్చినప్పటినుంచి… కోలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్ నయనతార ప్రేమ, పెళ్లి గురించి వచ్చినన్ని వార్తలు ఏ ఇతర హీరోయిన్ మీదా వచ్చిఉండవు. రెండుసార్లు ఆమె ప్రేమ పెళ్లిదాకా వచ్చి ఆగిపోయింది. ఇండస్ట్రీకి పరిచయమయిన కొత్తలోనే… ఆమె తమిళ హీరో శింబుతో ప్రేమలో పడింది. మామూలుగా అయితే హీరోయిన్లు పెళ్లిదాకా వచ్చే వరకు… తమ ప్రేమసంగతిని బయటకు రానివ్వరు. మీడియా ప్రశ్నించినా… అవన్నీ పుకార్లే అంటూ కొట్టిపారేస్తారు. కానీ నయన్ అందుకు భిన్నం. శింబుతో ప్రేమ వ్యవహారాన్ని అందరిముందూ ఒప్పుకుంది. వాళ్లిద్దరూ బహిరంగంగానే చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. నయన్ శింబు తల్లిదండ్రులకు కూడా నచ్చిందని, త్వరలోనే వారిద్దరూ పెళ్లిచేసుకుంటారని వార్తలు కూడా వచ్చాయి. కానీ… ఏం జరిగిందో తెలియదు… కానీ పెళ్లిపీటలెక్కకుండానే వారి ప్రేమ అర్ధాంతరంగా ముగిసిపోయింది.
ఆ తర్వాత కొన్నాళ్లకు నయనతార సీనియర్ హీరో కమ్ డైరెక్టర్, తన కన్నా వయసులో చాలా పెద్దవాడయిన ప్రభుదేవాకు సన్నిహితమయింది. ఎక్కడ చూసినా వారిద్దరే కనిపించారు. సినిమా పత్రికలన్నీ… వారి ప్రేమ వార్తలతో నిండిపోయాయి. దీనిపై ప్రభుదేవా భార్య భగ్గుమంది. ఆమె ప్రభుదేవా, నయనతార మీద కేసు పెట్టేదాకా వెళ్లినా… మధ్యవర్తుల జోక్యంతో వెనక్కి తగ్గింది. భార్యతో రాజీ కుదుర్చుకుని… నయనతారను పెళ్లాడేందుకు ప్రభుదేవా సిద్దమయ్యాడు. ముందే ఒప్పుకున్న సినిమాలను పూర్తిచేసి… ప్రభుదేవాను పెళ్లిచేసుకుని గృహిణిగా స్థిరపడాలనుకుంది నయనతార. తెలుగులో బాపూ దర్శకత్వంలో వచ్చిన శ్రీరామరాజ్యంతో తన సినీ కెరీర్ కు ముగింపు పలుకుతున్నానని ప్రకటించింది. షూటింగ్ చివరి రోజు భావోద్వేగానికి లోనై నయనతార కన్నీరు కూడా పెట్టుకుంది. శ్రీరామరాజ్యం తరువాత… కొత్త సినిమాలేవీ అంగీకరించకుండా… ప్రభుదేవాతో పెళ్లికి ఏర్పాట్లు కూడా చేసుకుంది. కానీ చివరినిమిషంలో ఏం జరిగిందో తెలియదు కానీ… పీటల దాకా వచ్చిన ఆ పెళ్లి ఆగిపోయింది.
దీంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది నయనతార. మామూలుగా ఓ హీరోయిన్ పెళ్లిచేసుకుంటున్నానని ప్రకటిస్తేనే… ఆమెకు సినిమాల్లో ఛాన్సులు తగ్గిపోతాయి. సినిమాలకు గుడ్ బై చెప్పి మళ్లీ తిరిగి వచ్చిన హీరోయిన్లు సక్సెస్ అయ్యే అవకాశం తక్కువ. కానీ నయనతార దీనికి భిన్నం. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ ఆమెకు అవకాశాలు క్యూకట్టాయి. రీ ఎంట్రీ నుంచి నయన జీవితంలోనూ, కెరీర్ లోనూ జాగ్రత్తగా అడుగులు వేసింది. చాలా రోజులు ప్రేమ వ్యవహారాల జోలికి వెళ్లకుండా కెరీర్ పైనే కాన్ సన్ ట్రేషన్ చేసింది. దీంతో ఆమె ఖాతాలో అనేక సూపర్ హిట్లు చేరాయి. తమిళంలో హీరోయిన్ గా ఓ రేంజ్ కు ఎదిగింది. నంబర్ వన్ వంటి స్థానాలకు ఆమె ఎప్పుడూ పోటీపడలేదు. ఎంతమంది హీరోయిన్లు ఉన్నా… తమిళంలో నయనతారకు ఓ ప్రత్యేక ఇమేజ్ ఉంది. మిగతా హీరోయిన్లలా అటు తెలుగులోనూ, ఇటు తమిళంలోనూ ఆమె ఎప్పుడూ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనదు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడానికీ పెద్దగా ఇష్టపడదు. అయినప్పటికీ ఆమెకు రెండు భాషల్లోనూ అవకాశాలకు కొదవలేదు. ప్రస్తుతం తమిళంలో అరడజను సినిమాలతో, తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్రహీరోల సీనిమాలతో తీరికలేకుండా ఉన్న నయన తార వ్యక్తిగత జీవితం గురించి మళ్లీ ఓ వార్త షికారుచేస్తోంది.
తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో నయన ప్రేమలో ఉందని కోలీవుడ్ మీడియా కొన్నాళ్లుగా కోడై కూస్తోంది. గతంలోలా నయనతార ఆ పుకార్లను ఒప్పుకోనప్పటికీ… విఘ్నేష్ తో మాత్రం చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. ఓ అవార్డుల ఫంక్షన్ కు విఘ్నేష్ తో కలిసి హాజరయింది. అలాగే విఘ్నేష్ బర్త్ డే సందర్భంగా ఇద్దరూ విదేశాల్లో షికార్లు చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. బాయ్ ఫ్రెండ్ కు ఓ ఖరీదైన కారును కూడా నయన గిఫ్ట్ గా ఇచ్చింది. వారిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారనడానికి ఇవన్నీ ఉదాహరణలుగా చెబుతున్నారు. ఇక త్వరలోనే వాళ్లిద్దరూ ఆర్య సమాజ్ లో పెళ్లిచేసుకోబోతున్నారని ఓ వార్త వినిపిస్తోంది. పెళ్లి తరువాత వారు కలిసి ఉండటానికి ఒక ఖరీదైన విల్లాను కూడా కొన్నట్టు తెలుస్తోంది. ఈ సారైనా నయన ప్రేమ పెళ్లిపీటలెక్కాలని, విఘ్నేష్ తో కలిసి ఆమె ఆనందంగా జీవించాలని అభిమానులు కోరుకుంటున్నారు.