Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఓ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవాలంటే ప్రస్తుతం తప్పనిసరిగా కావల్సింది ప్రచారం. సినిమాలో విషయం లేకపోయినా..ప్రచారార్భాటాలతో హిట్ అయిన మూవీస్ ఉన్నాయి. ఆడియో రిలీజ్, ప్రి రిలీజ్ ఫంక్షన్ ఇలా రకరకాల పేర్లతో సినిమాకు పబ్లిసిటీ కల్పిస్తారు. డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా సినిమాకు సంబంధించిన కీలక వ్యక్తులంతా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందే. ముఖ్యంగా హీరో, హీరోయిన్లు ప్రత్యేక ఇంటర్వ్యూలతో సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చుకుంటారు. అయితే తమిళంలో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న నయనతార ఇందుకు మినహాయింపు. సినిమాకు సైన్ చేయడం, షూటింగ్ పూర్తయ్యేదాకా నటించడం వరకే ఆమె పని. ప్రచార కార్యక్రమాల్లో మాత్రం ఆమె ఎక్కడా కనిపించదు. ఒక్క శ్రీరామరాజ్యం ప్రచార కార్యక్రమంలో మాత్రమే నయనతార బాలకృష్ణతో కలిసి పాల్గొన్నారు. ఆ సినిమా తప్ప మరే సినిమాకోసమూ ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వడం కానీ, ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ చేయలేదు.
తెలుగులో ఆమె నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం అనామిక ప్రచార కార్యక్రమాలకు ఆమె రాకపోవడంపై అప్పట్లో ఆ సినిమా డైరెక్టర్ శేఖర్ కమ్ముల బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ ఒక్క సినిమా సందర్భంలోనే కాదు..అంతకుముందూ..ఆ తరువాత కూడా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు కాకపోవడంపై తెలుగు, తమిళ దర్శకులు, హీరోల నుంచి ఆమెపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అయినా సరే ఆమెకు అవకాశాలకు కొదువ లేదు. . ప్రచార కార్యక్రమాలకు రాకపోయినా సరే..ఆమె తమ సినిమాలో నటిస్తే చాలు అని తమిళ, తెలుగు దర్శకులు, హీరోలు భావిస్తుంటారు. అంతటి క్రేజ్ నయన సొంతం. మూడు పదులు దాటినా..తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న నయనతార తాజాగా అరాం అనే చిత్రంలో నటించారు. గోపీ నైనర్ దర్శకత్వం వహించిన అరాంలో నయన కలెక్టర్ పాత్ర పోషించారు. తొలిరోజే ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. నయన నటనపై విమర్శకుల నుంచి సైతం ప్రశంసల వర్షం కురుస్తోంది. గ్రామాల్లో తాగునీటితో పాటు కనీస వసతుల కోసం ప్రజల తరపున నిలిచి పోరాడే పాత్రలో ఆమె నటన అద్భుతంగా ఉందని పలువురు కొనియాడుతున్నారు.
ఈ సినిమాతో ఆమెకు లేడీ సూపర్ స్టార్ అన్నగుర్తింపు వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నయనతార కూడా ఈ సినిమాను చాలా ప్రత్యేకంగా భావిస్తున్నారు. అందుకే తన పద్ధతిని పక్కనపెట్టి అరాం ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తన కెరీర్ లో తొలిసారి ఆమె థియేటర్ కు వచ్చి ప్రేక్షకుల మధ్య కూర్చుని తన సినిమా వీక్షించారు. సినిమాలో కనిపించినట్టుగానే కలెక్టర్ వస్త్రధారణలో చెన్నైలోని కాశీ థియేటర్ కు వచ్చిన నయనతారను చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. నయన థియేటర్ లో సందడిచేసిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియలో హల్ చల్ చేస్తున్నాయి. మరోవైపు అరాం కోసం నయనతార ఓ హీరోయిన్ లా కాకుండా సహాయ దర్శకురాలిగా పనిచేశారని దర్శకుడు గోపీనైనర్ ప్రశంసించారు. షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఆమె తన వ్యానులోకి వెళ్లేవారు కాదని, సినిమా పనులు చూసుకుంటూ సలహాలు ఇచ్చేవారని, సినిమాను హిట్ చేస్తానని ఆమె తనకు ప్రామిస్ చేశారని డైరెక్టర్ తెలిపారు. మాట ఇచ్చినట్టుగానే నయన సినిమాలో అద్భుతంగా నటించడంతో పాటు..తన వైఖరికి భిన్నంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ అరాం విజయం కోసం శ్రమిస్తున్నారు.