చంద్రబాబు నిర్వహించిన ‘సాధన దీక్ష’పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనానికి మధ్య కొన్ని గంటలు ఉపన్యాసం ఇచ్చి.. దానిని నిరసన దీక్ష పేరుతో ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు టిఫిన్ చేసి దీక్ష మొదలుపెట్టిన చంద్రబాబు మధ్యాహ్నం భోజన సమయం వరకూ కొనసాగించారు. మధ్యలో గంటకు పైగా తనకు అలవాటైన రీతిలో ఉపన్యాసం ఇవ్వగా.. మరో 20 మంది నేతలు మైకు ముందు విశ్వరూపం ప్రదర్శించారు. వారి ఉపన్యాసాలతో మూడు గంటలు ఇట్టే గడిచిపోయాయి.
మామూలుగా అయితే రాజకీయ నాయకులు ఒకరోజు దీక్ష చేస్తారు. కానీ.. చంద్రబాబు ఆఫీసుకు వెళ్లివచ్చే సమయంలో చాలా సులభమైన రీతిలో ఈ కార్యక్రమం పెట్టి, దానికి సాధన దీక్ష అని పేరు పెట్టుకుని హడావుడి చేయడం ప్రచారంలో భాగమేనంటున్నారు. పార్టీ కార్యాలయం నుంచి జూమ్ కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు, మరికొందరు నేతలు పాల్గొనగా.. నియోజకవర్గాల్లో తమ ఇళ్లు, కార్యాలయాల నుంచి ఆ కాన్ఫరెన్స్‌లో టీడీపీ నేతలు ఉపన్యాసాలు ఇచ్చారు. మొత్తంగా సాధన దీక్ష చంద్రబాబు ప్రతిరోజు నిర్వహించే జూమ్ కాన్ఫరెన్సేనని తమ్ముళ్లు చెబుతున్నారు. కాకపోతే ప్రచార జిమ్మిక్కులు బాగా తెలిసిన ఆయన కోటరీ ఈ కాన్ఫరెన్స్‌కే సాధన దీక్ష అని పేరు పెట్టి, దాన్ని సభలాగా చిత్రీకరించి ఒక పెద్ద కార్యక్రమంలా హంగామా చేసిందంటున్నారు.