Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రళయం, భూగోళ అంతం గురించి ఎప్పటికప్పుడు జోస్యులు కొత్త కొత్త తేదీలు ప్రకటిస్తూనే వున్నారు. ఆ డేట్ లు వాచిపోతున్నాయి గానీ భూమి నిక్షేపంగా వుంది. జనాభా సంఖ్య కూడా అంతకంతకీ పెరుగుతూనే వుంది కానీ తగ్గడం లేదు. కానీ గ్రహాల పేరు చెప్పి డబ్బు దండుకునే వాళ్ళు మాత్రం పాత డేట్ లో తాము చెప్పింది జరగలేదన్న విషయం తేలిగ్గా మర్చిపోతూ కొత్త డేట్స్ పుట్టిస్తూ పోతున్నారు. రెండు మూడు నెలలకి ఓ సారి ఇలా ఏదో ఒక గ్రహం పేరు చెప్పి ప్రళయం రాబోతోందని జనాన్ని భయపెట్టి కొందరు సొమ్ము చేసుకుంటే ,ఇంకొందరు సరదా తీర్చుకుంటున్నారు. ఈ తరహా వ్యవహారాలు ఒక్క భారత్ కే పరిమితం అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అమెరికాతో పాటు కొన్ని యూరప్ దేశాల్లోనూ ఈ తంతు జోరుగా సాగుతోంది. లేటెస్ట్ గా ఇలాంటి జోస్యుల దృష్టి రేపు అంటే డిసెంబర్ 21 మీద పడింది. తాజాగా వాళ్ళు చెబుతున్న జోస్యం ఏమిటంటే .
ఈ ఏడాది మొత్తం మీద అతి తక్కువ పగటి కాలం డిసెంబర్ 21 న అంటే రేపు నమోదు అవుతుంది. అలాంటి రోజున ఓ దుశ్శకునం రాబోతోందట. నీల్ స్పెన్సర్ అనే ఓ జ్యోతిష్కుడు చెప్పిన దాని ప్రకారం డిసెంబర్ 21 న గ్రహగతుల్లో జరిగే ఓ పరిణామం ప్రళయానికి సంకేతం అంట. డిసెంబర్ 21 న సూర్యుడు , శని ఒకే రాశిలో ప్రవేశిస్తున్నందున రానున్న రోజుల్లో చెడు జరిగే అవకాశం ఉందట. ఈ కాంబినేషన్ ప్రళయానికి సంకేతం అంట. ఇలాంటి ఖగోళ మార్పు 350 ఏళ్ళ కిందట అంటే 1664 లో జరిగినప్పుడు కూడా కొన్ని అరిష్టాలు చోటు చేసుకున్నాయట. ఇప్పుడు డిసెంబర్ 21 తర్వాత కూడా ఆ తరహా సంకేతాలు వుంటాయని స్పెన్సర్ చెబుతున్నారు.
స్పెన్సర్ చెప్పిన ఆ మాటలు పట్టుకుని మన దేశానికి చెందిన కొందరు జ్యోతిష్కులు బాగానే సొమ్ము చేసుకుంటున్నారు. ప్రళయం వస్తోందని చెప్పకుండా శని , సూర్యుడు ఒకే రాశిలో చేరడం వల్ల కొన్ని రాశుల్లో పుట్టిన వారికి అరిష్టం అని , వారు గ్రహశాంతి కోసం పూజలు చేయించుకుంటే మంచిదని అంటున్నారు. మొత్తానికి ఇదిగో ప్రళయం అదిగో ప్రళయం అని చెప్పే డేట్స్ లిస్ట్ లో ఇప్పుడు డిసెంబర్ 21 , 2017 కూడా చేరిపోయింది.