ఐదు ఇన్నింగ్స్‌లలో కలిపి 62 పరుగులు …ఈసారి ఐపీఎల్లో కేదార్ జాదవ్ ప్రదర్శన ఇది. చెన్నై 10 మ్యాచ్‌లు ఆడగా, 8 మ్యాచ్‌లలో అతనికి అవకాశం లభించింది. కానీ ఒక రెగ్యులర్ బ్యాట్స్‌మన్‌గా అతడి నుంచి కనీస ప్రదర్శన కూడా రాలేదు. టీమ్ మేనేజ్మెంట్ కూడా అతడిని సరిగ్గా వాడుకోలేదు. సోమవారం మ్యాచ్‌లో మరో 14 బంతులు మిగిలి ఉన్న సమయంలో ఏడో స్థానంలో అతను బ్యాటింగ్‌కు వచ్చాడు. అతి కష్టమ్మీద 7 బంతుల్లో 4 పరుగులు చేయగలిగాడు. ఎప్పుడూ ఫిట్నెస్ సమస్యలతో బాధపడే జాదవ్, చివరి ఓవర్లో జడేజాతో పాటు రెండో పరుగు తీయలేక కూర్చుండిపోయాడు! ఈ సీజన్లో బౌలింగే చేయని కేదార్, చురుకైన ఫీల్డర్ కూడా కాదు.
యువ ఆటగాళ్లు రుతురాజ్, జగదీశన్‌లను పక్కన పెట్టి మరీ జాదవ్‌కు సీఎస్కే వరుస అవకాశాలు ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 2018 వేలంలో ఏకంగా రూ. 7.8 కోట్లకు చెన్నై అతడిని తీసుకుంటే ఒక్కటే మ్యాచ్ ఆడి గాయంతో దూరమయ్యాడు. 2019లో కూడా 12 ఇన్నింగ్స్‌లు ఆడినా చేసింది 162 పరుగులే. ‘సీనియర్ సిటిజన్స్’ అంటూ ఇప్పటికే పలు వ్యంగ్య విమర్శలు ఎదుర్కొంటున్న చెన్నై 35 ఏళ్ల జాదవ్‌కు అవకాశాలు ఇస్తోంది. మరోవైపు గత ఏడాది 26 వికెట్లతో ‘పర్పుల్ క్యాప్’ అందుకొని చెన్నై ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించిన ఇమ్రాన్ తాహిర్‌కు 10 మ్యాచ్‌లలో కూడా అవకాశం దక్కలేదు. బ్రేవో గాయపడినా… అతని స్థానంలో తాహిర్‌ను తీసుకునే ఆలోచన చెన్నై చేయలేదు.