ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ తనిష్క్ సోషల్‌మీడియా నుంచి తన యాడ్‌ను తొలగించింది. రెండు రోజుల నుంచి నెటిజన్ల ఆగ్రహానికి గురవుతోంది. ‘‘ఏకత్వం’’ పేరిట ప్రవేశపెట్టిన కొత్త కలెక్షన్ కోసం తనిష్క్ ఒక యాడ్‌ను క్రియేట్ చేసింది. ఇందులో, హిందూ మహిళను తమ ఇంటికి కోడలిగా ఆహ్వానించిన ముస్లిం కుటుంబం, ఆమె సీమంతం నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. పుట్టింటి ప్రేమను తలపించేలా హిందూ సంప్రదాయం ప్రకారమే ఘనంగా వేడుక చేస్తుంది.
ఇక నలభై ఐదు సెకన్ల నిడివి గల ఈ వీడియోకు, ‘‘తమ సొంతబిడ్డలాగా ఆదరించే కుటుంబంలోకి ఆమె కోడలిగా వెళ్లింది. కేవలం ఆమె కోసమే వాళ్లు తమ సంప్రదాయాన్ని పక్కనపెట్టి ఈ వేడుక నిర్వహించారు. సాధారణంగా ఎవరూ ఇలా చేయరు. ఇది రెండు వేర్వేరు మతాలు, సంప్రదాయాలు, సంస్కృతుల అందమైన కలయిక’’అని తనిష్క్ సంస్థ డిస్క్రిప్షన్ పొందుపరిచింది. దీనిపై నెటిజన్లు మండిపడిన సంగతి తెలిసిందే. బాయ్‌కాట్ తనిష్క్ అంటూ నిన్నంతా ట్రెండ్ చేసిన సంగతి తెలిసిందే. లవ్ జిహాద్‌ను తనిష్క్ ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. మంగళవారం కూడా ఇదే ట్రెండ్ కావడంతో తనిష్క్ ఆ యాడ్‌ను తొలగించింది.