Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రస్తుత వైఖరికీ గతంలోని ప్రవర్తనకూ చాలా తేడా ఉంది. పదమూడేళ్ల నుంచి రాజకీయాల్లో ఉంటున్నా..ఇప్పుడు కనిపించినంత బలమైన నేతగా గతంలో ఎప్పుడూ రాహుల్ లేరు. కేంద్రప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని వినిపించడంలో ఆయన చురుకైన పాత్ర పోషిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా… పదునైన విమర్శలతో మోడీ పై విరుచుకుపడుతున్నారు. అందుకే ఇప్పుడు రాహుల్ గాంధీని పప్పు అనడానికి సొంత పార్టీ నేతలే కాదు… అధికార బీజేపీ కూడా ఆలోచిస్తోంది. ఆయనను యువరాజుగా సంబోధిస్తోంది. అలాగే శివసేనతో పాటు అధికార బీజేపీలోని కొందరు నేతలు నుంచి కూడా రాహుల్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. రాహుల్ ఇంకెంత మాత్రం పప్పు కాదని, ఇకపై ఆయన్ను తేలికగా తీసుకుని వదిలేయకూడదని, ఆయన సత్తా పెరిగిపోతోందని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే ఇటీవల వ్యాఖ్యానించి కలకలం సృష్టించారు.
రాహుల్ గాంధీ చాలా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారని, ప్రధాని మోడీ చరిష్మా తగ్గితే…ఆ వెంటనే రాహుల్ బలంపుంజుకుని బీజేపీని అధికారానికి దూరం చేయగలడని కూడా ఆయన హెచ్చరించారు. గుజరాత్ ఎన్నికలు రాహుల్ చరిష్మాకు పరీక్షవంటివన్న అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు గుజరాత్ లో బీజేపీ విజయం నల్లేరు మీద నడక అనుకున్నా ప్రస్తుత పరిస్థితి మాత్రం అలా లేదని, కాంగ్రెస్ ఎన్నికల్లో గెలుపొందలేకపోయినప్పటికీ..బీజేపీతో పోటాపోటీగా నిలుస్తుందని, రాహుల్ గాంధీకి పెరిగిన ప్రజాదరణే ఇందుకు కారణమని విశ్లేషణలు వెలువడుతున్నాయి. వీటి సంగతి పక్కనపెడితే రాహుల్ ఇతర విషయాల్లో సత్తా పెంచుకున్నారేమో కానీ..తన ప్రసంగాల విషయంలో మాత్రం పాత రాహుల్ నే తలపిస్తున్నారు.
రాహుల్ ప్రసంగంలో దొర్లిన తప్పులు గతంలో అనేక సార్లు నెట్ లో వైరల్ గా మారాయి. అయినా రాహుల్ తన ప్రసంగాలపై ప్రత్యేకదృష్టిపెట్టడం లేదనడానికి తాజాగా గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. అహ్మదాబాద్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ ప్రసంగిస్తూ బంగాళాదుంపల్ని యంత్రంలో పెట్టగానే..బంగారం వచ్చేలా ఓ యంత్రం తయారుచేస్తానని, దీనివల్ల రైతులకు బాగా డబ్బులు వస్తాయని వ్యాఖ్యానించారు. నెటిజన్లు రాహుల్ వ్యాఖ్యలపై వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. ఇప్పుడే కాదు గతంలోనూ రాహుల్ అనేకసార్లు తన ప్రసంగాలతో నెటిజన్లకు చిక్కారు. ఉత్తరప్రదేశ్ లో రైతులను ఉద్దేశిస్తూ మామిడి పండ్లను తయారుచేసే యంత్రాలు అని ఆయన వ్యాఖ్యానించడం తీవ్ర కలకలం రేపింది. రైతులు మామిడిపండ్లను పండిస్తే..రాహుల్ మాత్రం వాటిని తయారుచేస్తారు అంటూ నెటిజన్లు ఛలోక్తులు విసిరారు. అలాగే అమెరికా పర్యటనలో రాహుల్ లోక్ సభ స్థానాల సంఖ్యను 545కు బదులుగా 546 అని చెప్పడంపైనా…సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమయ్యాయి. లోక్ సభకు ఎన్నిస్థానాలు ఉంటాయో తెలియని వ్యక్తి ఇక దేశానికి ప్రధానమంత్రి ఎలా కాగలడంటూ….రాహుల్ వ్యతిరేకులు, నెటిజన్లు విమర్శనాస్త్రాలు సంధించారు. ఇప్పటికైనా రాహుల్ తన ప్రసంగాల్లో ఆచితూచి మాట్లాడడం నేర్చుకోవాలని పలువురు సూచిస్తున్నారు.