ఫోటోగ్రాఫర్‌కి మద్దతు

ఫోటోగ్రాఫర్‌కి మద్దతు

పెళ్లి వేడుకలో అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తుల్లో ఫోటోగ్రాఫర్‌ కూడా ఉంటాడు. పెళ్లి తంతును అందమైన జ్ఞాపకాలుగా మలుస్తాడు. అలాంటి వ్యక్తిని సరిగా గౌరవించకుండా చిరాకు తెప్పిస్తే.. ఇదిగో ఇక్కడ మీరు చూడబోయే ఫోటోగ్రాఫర్‌ మాదిరిగా ప్రవర్తిస్తాడు. ఆ తర్వాత లబోదిబో అన్నా ఏం ప్రయోజనం ఉండదు. ఉదయం నుంచి పని చేయించుకున్నారు తప్ప.. తిండి పెట్టలేదని ఆగ్రహించిన ఫోటోగ్రాఫర్‌.. మొత్తం పెళ్లి ఫోటోలను డిలీట్‌ చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు.

రెడిట్‌లో షేర్‌ చేసిన ఈ స్టోరీ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. సదరు ఫోటో గ్రాఫర్‌ ఆవేదన ఇలా ఉంది.. ‘‘నేను డాగ్‌ గ్రూమర్‌ గా పని చేస్తుండేవాడిని. కానీ నా స్నేహితుడి కోరిక మేరకు.. అతడి పెళ్లికి ఫోటోగ్రాఫర్‌గా మారాను. ఉదయం 11.00 గంటలకు పని మొదలు పెడితే సాయంత్రం 7.30 వరకు పని చేస్తూనే ఉన్నాడు. మధ్యలో కాసేపు కూడా విరామం లభించలేదు’’ అని చెప్పుకొచ్చాడు.

‘‘కాఫీ, టీల సంగతి పక్కకు పెడితే.. కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. సాయంత్రం ఐదు గంటలకు విందు ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా నాకు తినడానికి అవకాశం ఇవ్వలేదు. ఓపిక నశించి.. చివరకు వరుడి దగ్గరకు వెళ్లి.. నాకు 20 నిమిషాల పాటు బ్రేక్‌ కావాలి. ఏమైనా తిని వస్తాను అని అడిగాను. కానీ పెళ్లి వేడుక జరిగే ప్రాంతంలో ఒక్కటంటే ఒక్క ఓపెన్‌ బార్‌ కూడా లేదు. వెనక్కి వచ్చి విషయం చెప్పాను. కానీ వారు దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. పైగా నువ్వు ఉండాల్సిందే.. వెళ్లిపోతే.. నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని బెదిరించాడు’’ అని చెప్పుకొచ్చాడు.

‘‘ఓ వైపు ఉక్కపోత.. ఆకలి.. దాహంతో నోరు ఎండుకుపోతుంది. ఆ సమయంలో నాకు సాయం చేయాల్సింది పోయి.. అంత రూడ్‌గా మాట్లడటంతో.. నా కోపం పెరిగిపోయింది. ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. వెంటనే నేను అప్పటి వరకు తీసిన ఫోటోలను డిలీట్‌ చేశాను. ఆ తర్వాత బయట ఒక్క గ్లాస్‌ చల్లని మంచినీటి కోసం నేను ఏకంగా 250 డాలర్లు ఖర్చు చేశాను. నా స్నేహితుడి తీరు నన్ను ఎంతో బాధించింది’’ అని తెలిపాడు సదరు ఫోటోగ్రాఫర్‌.ఈ పోస్ట్‌ చూసిన నెటిజనులు ఫోటోగ్రాఫర్‌కి మద్దతు తెలుపుతున్నారు. ‘‘నీ స్నేహితుడి ప్రవర్తన సరిగా లేదు. వారికి తగిన విధంగా బుద్ధి చెప్పావ్‌’’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు.