ఆమెది చీప్‌ పబ్లిసిటీ అంటూ విమర్శలు

ఆమెది చీప్‌ పబ్లిసిటీ అంటూ విమర్శలు

‘‘నువ్వు ఎలా ఉన్నా సరే.. ఎవరో ఒకరు నిన్ను జడ్జ్‌ చేయడం మానరు. కాబట్టి ఇతరులను ఇంప్రెస్‌ చేసేలా బతకాల్సిన అవసరం లేదు, నిన్ను నువ్వు సంతోషపెట్టుకుంటూ, నీకు నచ్చినట్లుగా నువ్వు ఉండు’’ అంటూ బాలీవుడ్‌​ నటి, టీవీ స్టార్‌ అంకితా లోఖండే తన అందమైన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఎదుటివారిని సంతోషపెట్టాలని భావిస్తే భంగపడక తప్పదని, కాబట్టి ఎవరికి నచ్చినట్లు వారు జీవించడమే ఉత్తమమని చెప్పుకొచ్చారు. కాగా బుల్లితెరపై నటిగా ప్రాచుర్యం పొంది ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరైన అంకిత.. కంగనా రనౌత్‌ ‘మణికర్ణిక’ సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించిన అంకిత, ఆ తర్వాత భాగీ 3 వంటి పలు చిత్రాల్లోనూ మెరిశారు.

ఇక అంకిత గతంలో.. ‘పవిత్ర రిష్తా’ సీరియల్‌లో తనకు జోడీగా కనిపించిన సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ను ప్రేమించిన సంగతి తెలిసిందే. ఆరేళ్ల పాటు కొనసాగిన వీరి బంధంలో కలతలు చెలరేగడంతో స్నేహపూర్వకంగా విడిపోయారు. ఆ తర్వాత అంకిత విక్కీ జైన్‌కు దగ్గర కాగా.. సుశాంత్‌ నటి రియా చక్రవర్తి ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలో జూన్‌ 14న అతడు బలవన్మరణానికి పాల్పడిన విషయం విదితమే. దీంతో భావోద్వేగానికి లోనైన అంకిత.. సుశాంత్‌ కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. సుశాంత్‌ మృతి కేసు అనూహ్యమైన మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో న్యాయమే గెలుస్తుందంటూ అతడి కుటుంబానికి మద్దతుగా నిలవగా, సింగర్‌ శిబానీ దండేకర్‌ వంటి కొంతమంది వ్యక్తులు, ఆమెది చీప్‌ పబ్లిసిటీ అంటూ విమర్శలకు దిగారు. అయినప్పటికీ అంకిత ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, ట్రోల్స్‌కు గట్టిగా కౌంటర్‌ ఇచ్చారు.