కాళ్ల పారాణి ఇంకా ఆరనేలేదు… ఈలోగా వరకట్న పిశాచి కాటువేసింది… నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనతో మండలం ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైంది. సంఘటనపై సౌత్ జోన్ డీఎస్పీ వై జెస్సీప్రశాంతి మాట్లాడుతూ రేపల్లె మండలం ఈదుపల్లి గ్రామానికి చెందిన పిట్టు సాంబశివారెడ్డి కుమార్తె చైతన్య కు గుంటూరు రూరల్ మండలం దాసరిపాలెం గ్రామానికి చెందిన కోటి సాంబిరెడ్డి, రామానుజమ్మల కుమారుడు గోపిరెడ్డితో 16 రోజుల కిందట వివాహం జరిగింది. గోపిరెడ్డి హైదరాబాదులో ఒక సాప్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తుండగా ప్రస్తుతం ఇంటివద్ద నుంచే విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో పెళ్లయిన తరువాత నిద్రలు ముగించుకునే లోపు వధువు బంధువుల్లో ఒకరు మృత్యువాతకు గురయ్యారు.
శాస్త్ర ప్రకారం శూతకం కావటంతో 16 రోజుల పండుగ నిమిత్తం రెండు రోజుల కిందట చైతన్య తల్లి ఆమెను దాసరిపాలెంలో వదిలి సోమవారం మధ్యాహ్నం వరకూ ఉండి రేపల్లె వెళ్లింది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి సమయంలో ఇంట్లోని వారంతా టీవీ చూస్తుండగా బాత్‌రూంకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన చైతన్య ఎంతకీ రాలేదు. అనుమానంతో వెళ్లి చూడగా బాత్‌రూంలో కిటికీకి ఉరివేసుకుని కనిపించింది.
వెంటనే చైతన్యను ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పెళ్లయిన నాటినుంచి భర్త, అత్తమామలు వేధించేవారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. నవ వధువు 16 రోజుల పండగకు ముందే ఆత్మహత్య చేసుకుందన్న సంఘటన తెలిసి మండలంలో చర్చనీయాంశంగా మారింది. ఏం జరిగిందనేది పోలీసుల దర్యాప్తులోనే తేలాల్సి ఉంది.