ఓ నవవధువు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించిన ఘటన కోరుకొండ మండలం గాదరాడలో సోమవారం సంచలనం రేపింది. ఈ నెల 29న సామర్లకోట మండలం మేడపాడుకు చెందిన అశ్విని స్వాతి(19)కి గాదరాడకు చెందిన కనుమరెడ్డి అశోక్‌తో వివాహం జరిగింది. అత్తవారు కొత్తగా కట్టుకున్న ఇంటిలో రెండు రోజుల క్రితం గృహ ప్రవేశం కూడా చేసింది. ఇంతలో ఏమైందో ఏమో ఆ కొత్త ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న నార్త్‌జోన్ డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు పరిసరాలను పరిశీలించారు.
మృతురాలి తల్లి వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కోరుకొండ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మూడేళ్ల క్రితమే ఈ వివాహం చేసేందుకు పెద్దలు అంగీకారం కుదుర్చుకున్నారు. వ్యవసాయ పనులు చేసుకునే అశోక్ 5వ తరగతి వరకే చదువుకోగా, 7వ తరగతి వరకు చదివిన స్వాతి మైనార్టీ తీరే వరకు ఆగారు. ఈ పెళ్లి ఇష్టం లేక స్వాతి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది.