కరోనా కాలంలో కట్న పిశాచులు చెలరేగుతున్నారు. దొడ్డ తాలూకా దొడ్డబెళవంగల పోలీస్‌స్టేషన్ పరిధిలోని కసాఘట్ట గ్రామంలో వరకట్న దాహానికి మోనిషా (20) అనే నవ వధువు బలైంది. 6 నెలల క్రితం మోనిషాను కసాఘట్ట గ్రామానికి చెందిన ముత్తేగౌడ అనే వ్యక్తితో పెళ్లి చేశారు. ఒక్కతే కుమార్తె కావడంతో ఆమె తల్లిదండ్రులు ఘనంగా వివాహం జరిపించి కట్నకానుకలు భారీగా సమర్పించారు.
కొన్నిరోజులకే మరింత డబ్బు తేవాలని భర్త వేధించసాగాడు. ఈ ఆరునెలల్లో పలుమార్లు డబ్బులు ఇచ్చామని అయితే తాము ఉంటున్న ఇల్లు కూడా రాసివ్వాలని ఒత్తిడిచేయడంతో మోనిషా పుట్టింటికి వచ్చేసింది. ఇటీవల పెద్దలు రాజీచేసి అత్తవారింటికి పంపారు.
మంగళవారం ఉదయం ఫోన్‌చేసిన ముత్తేగౌడ మోనిషాకు ఫిట్స్ వచ్చి మరణించిందని చెప్పాడన్నారు. మోనిషాకు ఎప్పుడూ ఫిట్స్ రావని, భర్త, కుటుంబ సభ్యులతో కలిసి హత్యచేసి నాటకామాడుతున్నారని యువతి తల్లిదండ్రులు తెలిపారు. వారు ముత్తేగౌడ, తల్లి శారదమ్మ, తండ్రి శివకుమార్, చెల్లెలు సుధలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.