పెళ్లయిన ఐదురోజులకే ఆత్మహత్య చేసుకున్న నవ వధువు

పెళ్లయిన ఐదురోజులకే ఆత్మహత్య చేసుకున్న నవ వధువు

పెళ్లయిన ఐదురోజులకే నవ వధువు అత్తారింట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం అంతర్గాం మండల పరిధిలోని పొట్యాల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు..మండలంలోని ముర్మూర్‌ గ్రామానికి చెందిన పెసరు రాజమల్లు–మల్లమ్మ దంపతులకు నలుగురు కూతుర్లు కాగా మమత చిన్నకూతురు. పొట్యాల గ్రామానికి చెందిన మస్కం రాయమల్లు అనే రిటైర్డ్‌ సింగరేణి ఉద్యోగి ఏకైక కుమారుడు మస్కం స్వామి అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి ఇచ్చి ఈ నెల 11వ తేదీన కట్నకానుకలతో వివాహం జరిపించారు.

ఈ నేపథ్యంలో పెళ్లయిన ఐదురోజుల్లోనే పొట్యాలలోని అత్తారింట్లో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మృతురాలు చివరగా తన సెల్‌ఫోన్‌ వాట్సప్‌లో చాటింగ్‌ చేసిన మెసేజ్, ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపై పోలీసులు విచారిస్తున్నారు. కాగా యువతికి, యువకుడికి గతంలో వివాహం అయి విడాకులు అయినట్లు తెలిసింది. గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, రామగుండం సీఐ తాండ్ర కరుణాకర్‌రావు, అంతర్గాం ఏఎస్సై పురుషోత్తంరెడ్డి తదితరులు ఘటన స్థలాన్ని పరిశీలించి యువతి మృతిపై దర్యాప్తు చేస్తున్నారు.