ఈత సరదా ఓ నవ వరుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పెళ్లయిన 28 రోజులకే కట్టుకున్న భార్యను, చేసిన బాసల్ని వదిలేసి వెళ్లిపోయాడు. పెళ్లి సందర్భంగా పార్టీ చేసుకుని అప్పటిదాకా మిత్రులతో సరదాగా గడిపాడు. తర్వాత కృష్ణా నదిలో ఈత కొట్టడానికి వచ్చి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన తాడేపల్లి పట్టణ పరిధిలోని కృష్ణా నది రైల్వే బ్రిడ్జి కింద ఆదివారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం… విజయవాడ మాచవరం డౌన్లో నివాసం ఉండే గరికె కోటా వెంకట వరప్రసాద్(లేటు), లక్ష్మి పెద్దకొడుకైన గరికె సాయిఫకీర్ (22) తండ్రి చనిపోవడంతో ఎల్రక్టీషియన్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
గత నెల 8న తాడేపల్లికి చెందిన వైష్ణవితో వివాహమైంది. పెళ్లైన 28 రోజుల తర్వాత స్నేహితులు పార్టీ అడగడంతో సాయిఫకీర్ విజయవాడలో పార్టీ చేసుకుని సాయంత్రం కృష్ణానదికి వచ్చి స్నానం చేసేందుకు పుష్కర ఘాట్ల పక్కనే ఉన్న రైల్వే బ్రిడ్జి దగ్గర నీటిలోకి దిగారు. సరదాగా గడుపుతున్న సమయంలో ఒక్కసారిగా సాయిఫకీర్ నీళ్లలోకి జారిపోయాడు. స్నేహితులు వెదికినప్పటికీ ఆచూకీ కనిపించ లేదు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్లను తీసుకుని మునిగిన ప్రాంతంలో వెతికించారు.
అయినా ప్రయోజనం లేకపోవడంతో మంగళగిరి అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. బోటు సాయంతో గాలించగా, గంటన్నర అనంతరం నీటిలో మునిగి చనిపోయిన సాయిఫకీర్ మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు బంధువులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి వచ్చి వైష్ణవి భోరున విలపించింది. భర్త బతికే ఉన్నాడని, ఆసుపత్రికి తీసుకువెళ్లండంటూ దుఃఖించడం చూపరులను కన్నీళ్లు పెట్టించింది. బంధువులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా, మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు.