మమతకి కొత్త తలనొప్పి…ఈసారి టీచర్స్

New headache for Mamatha

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి మరో తలనొప్పి మొదలైంది. ముఖ్యమంత్రితో సోమవారం సాయంత్రం జరిగిన చర్చలు సఫలం కావడంతో వారం రోజులుగా జరుగుతున్న సమ్మెను జూనియర్ వైద్యులు విరమించారు. అయితే ప్రభుత్వ టీచర్ల నిరసన ఉద్రిక్తంగా మారింది. వేతనాలు పెంచాలని గత ఆరు రోజులుగా  నిరసన తెలుపుతున్న టీచర్లు కోల్ కతాలోని వికాస్‌ భవన్‌ లోకి దూసుకొచ్చారు. దీంతో టీచర్లను అడ్డుకునేందుకు పోలీసులు బారీకేడ్లను ఏర్పాటు చేయగా, బారికేడ్లను ధ్వంసం చేసి వికాస్‌ భవన్‌ లోకి టీచర్లు ప్రవేశించడంతో ఉద్రిక్తంగా మారింది. శిశు శిక్ష కేంద్ర (ఎస్ఎస్‌కే), మాధ్యమిక శిక్షణ కేంద్ర టీచర్లు-పోలీసుల మధ్య ఈ సందర్భంగా తోపులాట చోటుచేసుకుంది. ఉపాధ్యాయులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. వికాశ్ భవన్‌లోని బెంగాల్ విద్యాశాఖ మంత్రిని కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రయత్నించగా ఈ ఘటన చోటుచేసుకుంది.  వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12 నుంచి ఉపాధ్యాయులు ధర్నాలు చేస్తున్నారు. గత ఎనిమిదేళ్లుగా వేతనాలు పెరగలేదని, విద్యార్హతల ఆధారంగా వేతనాలు పెంచాలన్నది వారి డిమాండ్. ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం వేతనాలను పెంచుతామని హామీ ఇచ్చిందని, ఎన్నికలు పూర్తైన ఆదిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం వల్లనే ఆందోళన చేస్తున్నామని టీచర్లు అంటున్నారు. తమ డిమాండ్లను పరిష్కారించే వరకు ఆందోళనలను కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చారించారు.