పంజాగుట్టలో ఉద్రిక్తత…వీహెచ్, హర్షకుమార్ అరెస్ట్

tension in panjagutta

మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మంగళవారం తెల్లవారుజామున పంజాగుట్ట సర్కిల్‌లోని వైఎస్ విగ్రహం ఎదుట ఆందోళనకు దిగారు. తొలగించిన అంబేడ్కర్ విగ్రహాన్ని పున:ప్రతిష్టించేందుకు ఆయన విగ్రహాన్ని తీసుకుని వచ్చారు. అయితే పోలీసులు అందుకు అభ్యంతరం తెలపడంతో వీహెచ్ అనుచరులకు వారికి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు తెలెత్తాయి. వీహెచ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంబేడ్కర్ విగ్రహ పున:ప్రతిష్టకు అనుమతి లేదని, అనుమతి వచ్చాక ప్రతిష్టించుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని ఏసీపీ తిరుపతి స్పష్టం చేశారు. మరోవైపు వీహెచ్ మాత్రం పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. వైఎస్ విగ్రహానికి లేని అభ్యంతరం మహానీయుడు అంబేడ్కర్ విగ్రహానికి ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అంబేడ్కర్ విగ్రహాన్ని తిరిగి అక్కడ పున:ప్రతిష్టించేదాకా తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కొందరు ప్రయత్నించగా ఇటీవల పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాదు, దానిని చెత్త తరలించే వాహనంలో పడేయడం అప్పట్లో వివాదాస్పదమైంది. ఈ ఉదయం ఓ లారీలో విగ్రహాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్, వివిధ సంఘాల నేతలు చౌరస్తాలో దానిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు హనుమంతరావు, హర్షకుమార్ సహా అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ సమితి అధ్యక్షుడు గుడిమల్ల వినోద్‌కుమార్‌ను అరెస్టు చేసి బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అంబేద్కర్ విగ్రహాన్ని, దానిని తీసుకొచ్చిన లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేతల అరెస్ట్‌తో పంజగుట్టలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.