టాటా గ్రూపుకి కొత్త చిక్కులు

టాటా గ్రూపుకి కొత్త చిక్కులు

ఎయిరిండియాను తిరిగి స్వాధీనం చేసుకున్నామన్న సంతోషం ఆస్వాదించకముందే టాటా గ్రూపుకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. మరోసారి మహారాజా స్టేటస్‌ని తెచ్చి పెట్టాలంటే చెమటోడ్చక తప్పని పరిస్థితిలు కళ్లేదుటే కనిపిస్తున్నాయి.

ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణలో భాగంగా వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న ఎయిరిండియాను అమ్మాలని కేంద్రం నిర్ణయించింది. ఇటీవల టాటా సన్స్‌ రూ. 18,000 కోట్లు చెల్లించేందుకు అంగీకరించి ఎయిరిండియాను దక్కించుకుంది. దీంతో ఎయిరిండియా స్థిర, చర ఆస్తులన్నీ టాటా సన్స్‌ స్వంతం అవుతాయి. ఇందులో బోయింగ్‌ విమానాలతో పాటు సిబ్బంది క్వార్టర్స్‌, కార్గో స్టేషన్లు ఇతర విలువైన భూములు కూడా ఉన్నాయి.

నిబంధనల ప్రకారం ప్రైవేటీకర ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆరు నెలలలోపు ప్రస్తుతం ఎయిరిండియా క్వార్టర్లలో ఉంటున్న సిబ్బంది వాటిని ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే ఎయిరిండియా కాలనీల్లో ఉంటున్న ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు. దీనిపై ఎయిరిండియా ఉద్యోగులు భగ్గుమంటున్నారు. ఉన్న పళంగా మమ్మల్ని క్వార్టర్లు ఖాళీ చేయమనడం దారుణమంటూ మండి పడుతున్నారు.

ఎయిరిండియాలో ప్రస్తుతం 12,085 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో పర్మినెంట్‌ ఉద్యోగులు 8084, కాంట్రాక్టు ఉద్యోగులు 4001 మంది ఉ‍న్నారు. ఇందులో చాలా మందికి ముంబై, ఢిల్లీ, కోల్‌కతా తదితర ఏరియాల్లో క్వార్టర్లు కేటాయించారు. ఇప్పుడు వాటిని ఖాళీ చేస్తే తమ కుటుంబాలు రోడ్డు మీద పడతాయంటూ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లు ఖాళీ చేయాలంటూ జారీ చేసిన నోటీసులు వెనక్కి తీసుకోకుంటే నవంబరు 2 నుంచి నిరవధిక సమ్మె చేస్తామంటూ తేల్చి చెబుతున్నారు.

ఎయిరిండియాను ప్రైవేటీకరించిన తర్వాత సెటిల్మెంట్‌, తమ భవిష్యత్తుకు భరోసా అందించేందుకు కేంద్రం నుంచి ఎటువంటి చర్యలు లేవని, కానీ ఇప్పటికిప్పుడు ఇళ్లు వదిలేసి వెళ్లాలంటూ ఆదేశాలు ఇవ్వడం అమానవీయమని ఉద్యోగులు అంటున్నారు. కనీసం తమతో చర్చలు జరిపేందుకు కూడా ఎవరూ సిద్ధంగా లేరంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏవియేషన్‌ రంగంలో తమదైన ముద్ర వేయాలని టాటాగ్రూపు ఎప్పటి నుంచో ఆశిస్తోంది. విస్తారాలో పెట్టుబడులు పెట్టినా పూర్తి స్థాయిలో టాటాల ఆశయం నెరవేరలేదు. ఈ సమయంలో ఎయిర్‌ ఇండియా ద్వారా ఏవియేషన్‌ రంగంలో దూసుకుపోవాలని టాటా యోచిస్తోంది. అయితే అంతకు ముందు ఉద్యోగుల సెటిల్‌మెంట్‌, క్వార్టర్లు తదితర చిక్కుముళ్లు వీడాల్సి ఉంది.