Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
న్యూయార్క్ ఉగ్రదాడి నిందితుడు సైఫుల్లా సైపోను ఘటనాస్థలిలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రదాడి జరుగుతుండగానే సైఫుల్లా పోలీసులకు చిక్కాడు. ఇది ఎలా జరిగిందన్నది ఎవరికీ అర్ధం కాలేదు. క్షణాల వ్యవధిలో సైఫుల్లాను న్యూయార్క్ పోలీసులు సజీవంగా ఎలా పట్టుకున్నారని అందరికీ సందేహం కలిగింది. న్యూయార్క్ పోలీస్ కమిషనర్ జేమ్స్ ఈ సందేహాన్ని నివృత్తి చేశారు. ఉగ్రదాడి జరగడానికి కొంతసేపటి ముందు రయాన్ నాష్ అనే ఓ పోలీస్ అధికారి విధుల్లో భాగంగా స్థానికంగా ఉన్న ఓ పాఠశాలకు వెళ్లారు. 17 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు ప్రయత్నించిందన్న సమాచారం అందడంతో రయాన్ హుటాహుటిన అక్కడకు బయలు దేరారు. అదే సమయంలో సైఫుల్లా ట్రక్కు దాడికి పాల్పడ్డాడు. దారిలో ఉన్న రయాన్ దాడి గమనించి ఘటనాస్థలికి వెళ్లారు. సైఫుల్లా వద్ద ఉన్న ఆయుధాలను కిందపడేయాల్సిందిగా హెచ్చరించారు. కానీ సైఫుల్లా వినలేదు. దాంతో రయాన్ తన గన్ తో సైఫుల్లా పొట్టలో కాల్చారు. కిందపడిపోయిన సైఫుల్లాను అదుపులోకి తీసుకున్నారు.
ట్రక్కుతో వేగంగా దూసుకొచ్చి సైక్లిస్టులను ఢీకొట్టిన సైఫుల్లా తర్వాత ట్రక్కు దిగి గన్ చేత్తో పట్టుకుని చిన్నారుల పైకి వెళ్లాడు. సరిగ్గా అదే సమయంలో రయాన్ అక్కడకు వచ్చి సైఫుల్లాపై కాల్పులు జరిపాడు. రయాన్ సమయస్ఫూర్తి వల్ల అనేకమంది చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు. రయాన్ పై పోలీస్ కమిషనర్ జేమ్స్ ప్రశంసలవర్షం కురిపించారు. ఉగ్రదాడికి పాల్పడ్డ సైఫుల్లా అసలు ప్రణాళిక ఏమిటో ఇంకా తెలియరాలేదు. సాధారణంగా ఇలా దాడులకు తెగబడ్డ ఉగ్రవాదులు ఆత్మాహుతికి పాల్పడతారు. లేదంటే క్షణాల వ్యవధిలో అక్కడినుంచి తప్పించుకుపోతారు. రయాన్ సమయస్ఫూర్తి వల్ల సైఫుల్లా పోలీసులకు చిక్కాడు. విచారణలో ఉగ్రదాడికి గల కారణాలను సైఫుల్లా వెల్లడించే అవకాశంఉంది.