హిజ్రాలతో కరోనా వైరస్…. మీరా సీరియస్

ప్రపంచాన్ని వణికిస్తోన్న వైరస్ కరోనా. ప్రస్తుతం ఉదయం లేస్తే చాలు సోషల్ మీడియాలో కరోనా వైరస్ తప్ప మరో వార్తే కనిపించడం లేదు. రాజకీయ నేతల నుంచి సినీ సెలబ్రిటీల వరకు అంతా కరోనాపై యుద్ధం ప్రకటించారు. అయితే అందులో పలు రకాల వార్తలు నిజాలు, అవాస్తవాలు, పుకార్లతో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో అలాంటి వాటిని నమ్మోద్దని అధికారులు, ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.

తాజాగా ఇప్పుడు కరోనారకు సంబంధించిన మరో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. హైదరాబాద్‌లో మరో కొత్త వార్త వెలుగు చూసింది. హిజ్రాలతో మాట్లాడినా.. సన్నిహితంగా ఉన్నా కరోనా వైరస్‌ సోకుతుందనే పోస్టర్లు వెలిశాయి. హైదరాబాద్‌‌లో పలు మెట్రో పిల్లర్లపైన ఇందుకు సంబంధించిన పోస్టర్లు దర్శనమిచ్చాయి.

అందులో ఏం రాసి ఉంది అంటే… ‘కొజ్జాలు, హిజ్రాలను దుకాణాల వద్దకు రానివ్వకండి.. వారిని తరిమి కొట్టండి లేదా డయల్‌ 100కు ఫోన్‌ చేయండి’ అని అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ వద్ద పోస్టర్లు వెలిశాయి. దీంతో ఒక్కసారిగా భాగ్యనగరంలో కలకలం రేగింది. దీనిపై హిజ్రాలు స్పందించారు. ట్రాన్స్‌జెండర్లపై వివక్ష, ఫేక్‌ న్యూస్‌, హింసను ప్రేరేపిస్తున్నవారిని కఠినంగా శిక్షించాలని ట్రాన్స్‌జెండర్ల కార్యకర్త మీరా సంఘమిత్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి అసత్య వార్తల్ని ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అంతేకాకుండా కర్ణాటకలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అక్కడ ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కొందరు విద్యార్థులపై ప్రాంతీయ వివక్ష వెలుగుచూసింది. ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులను సూపర్‌ మార్కెట్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దేశా రాజధాని ఢిల్లీలో కూడా.. మణిపురికి చెందిన ఓ అమ్మాయిని ఒకడు ‘కరోనా’అని పిలిచి అవమానించాడు. దీంతో ఇలాంటి ఘటనల పట్ల పోలీసులు సీరియస్ అవుతున్నారు. అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై నిఘా పెంచారు. కరోనా వైరస్ కు సంబంధించి ఎలాంటి అసత్య ప్రచారాలు చేయవద్దని హెచ్చరికలు జారీ చేశారు. పోలీసులు ఇంతలా మొత్తుకుంటున్నా కరోనాని నిర్లక్షంగా చూస్తూ ప్రజలు ఎగతాళిగా తీసుకుంటున్నారంటే.. వారినేం చేయాలి ఆలోచించాలి.