దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్‌కు ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చివరి నిమిషంలో అనూహ్యంగా తప్పుకోవడంతో తాత్కాలిక సారధిగా బాధ్యతలు చేపట్టిన కేఎల్ రాహుల్‌పై భారత మాజీ క్రికెటర్ సబా కరీం ప్రశంసల వర్షం కురింపించాడు. రాహుల్ ఇటీవలి కాలంలో ఫార్మాట్లకతీతంగా అద్భుతంగా రాణిస్తున్నాడని, టీమిండియా సారధ్య బాధ్యతలు చేపట్టేందుకు అతనికి అన్ని అర్హతలు ఉన్నాయని పొగడ్తలతో ముంచెత్తాడు.
రానున్న దశాబ్ద కాలం రాహుల్‌దేనని కొనియాడాడు. భవిష్యత్తులో అతను తిరుగులేని నాయకుడిగా ఎదుగుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్లు కోహ్లి, రోహిత్ ల గైర్హాజరీలో రాహుల్‌కు సారధ్య బాధ్యతలు అప్పజెప్పడం సరైన నిర్ణయమని అభిప్రాయపడ్డాడు. టెక్నిక్‌తో పాటు దూకుడును ప్రదర్శించడంలో రాహుల్ దిట్ట అని.. ప్రస్తుతం కెరీర్ అత్యుత్తమ దశలో కొనసాగుతున్నాడని, ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే భవిష్యత్తులో అతనికి తిరుగుండదని ఆకాశానికెత్తాడు.
బ్యాటర్‌గానే కాకుండా సారధిగా కూడా అతను ఇదివరకే నిరూపించుకున్నాడని, ఐపీఎల్‌లో పంజాబ్ కెప్టెన్‌గా వ్యవహరంచిన తీరే ఇందుకు నిదర్శమన్నాడు. భవిష్యత్తులో రాహుల్‌ను అన్ని ఫార్మాట్లలో కెప్టెన్‌గా నియమిస్తే.. జట్టును తిరుగులేని శక్తిగా నిలబెట్టడంతో పాటు క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్‌గా అవతరిస్తాడని జోస్యం చెప్పాడు. ఈ క్రమంలో ఎవరికీ సాధ్యం కాని ఎన్నో రికార్డులు నెలకొల్పుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఇదిలా ఉంటే, దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కోహ్లి స్ధానంలో విహారి జట్టులోకి వచ్చాడు. తొలి రోజు లంచ్ విరామం సమయానికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది. పుజారా, రహానే లు పరాజయాల పరంపరను కొనసాగించగా.. మయాంక్ కాస్త పర్వాలేదనిపించినా నిలదొక్కుకునే సమయంలో అవుటయ్యాడు. క్రీజ్‌లో రాహుల్ ఉన్నారు. సఫారీ బౌలర్లలో ఒలివర్ 2, జన్సెన్ ఓ వికెట్ పడగొట్టారు.