వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై దాడి కేసులో వైసీపీ ఊహించినట్లు ఊహించని ట్విస్ట్ లేమి జరగట్లేదు. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఏం చెప్పిందో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కూడా అదే చెప్పినట్లు తెలుస్తోంది. జగన్ పై దాడి కేసు విచారణకు ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అయితే వైసీపీ నేతలు తమకి ఏపీ ప్రభుత్వం, ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదని పేర్కొంటూ ఈ కేసుని ఎన్ఐఏకి అప్పగించాలని కోరారు. దీంతో కోర్టు ఈ కేసుని ఎన్ఐఏకి అప్పగించింది. విచారణ జరిపిన ఎన్ఐఏ ఇటీవలే ఈ కేసులో ఛార్జ్ షీటు వేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు రహస్యంగా ఉంచిన ఈ ఛార్జ్ షీటు వివరాలు ఇప్పుడు కొన్ని న్యూస్ చానెళ్ళ ద్వారా బయటకు పొక్కాయి.గతంలో సిట్ ఇచ్చిన రిపోర్ట్‌లోని అంశాలనే మళ్లీ ఎన్ఐఏ చెప్పిందని సమాచారం. ఈ ఘటనలో ఎటువంటి కుట్రకోణం లేదని ఎన్ఐఏ ఛార్జ్ షీటులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
నిందితుడు శ్రీనివాసరావు జగన్ అభిమాననని సానుభూతి రావాలని దాడికి పాల్పడ్డాడని సిట్ రిపోర్ట్ స్పష్టం చేసింది. సిట్ రిపోర్ట్‌తో ఎన్ఐఏ కూడా ఏకీభవించినట్లు తెలుస్తోంది. దాడి చేసే ముందు జగన్‌తో శ్రీనివాసరావు మాట్లాడాడని తెలిపింది. సర్, మన పార్టీ 160 సీట్లు గెలుస్తుందని జగన్‌తో శ్రీనివాసరావు చెప్పాడని ఎన్ఐఏ చార్జిషీట్లో వెల్లడించింది. పార్టీ నేతలతో కలిసి జగన్ వీఐపీ లాంజ్ లో ప్రవేశించాక వారికి అల్పాహారం, తేనీరు అందించేందుకు శ్రీనివాసరావు ఫుడ్ కోర్టు సిబ్బందితో కలిసి లోనికి వెళ్లి ఆ తరువాత ఆయనతో మాట కలిపి మీద దాడి చేసాడని తెలిపింది. మొత్తానికి ఎన్ఐఏ కూడా సిట్ చెప్పినట్లే.. సానుభూతి కోసమే శ్రీనివాసరావు జగన్ పై దాడి చేసాడని చెప్పినట్లు తెలుస్తోంది. జగన్ పై దాడి కేసు విషయంలో ఇప్పటివరకు అనేక ఆరోపణలు చేసిన వైసీపీ ఇప్పుడు ఎన్ఐఏ ఛార్జ్ షీటుతో ఇబ్బంది పడే అవకాశముంది.