దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత క్రమ క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఉక్రెయిన్- రష్యా యుద్ధం నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకుల్లో కొనసాగాయి. ఆరంభంలో భారీ లాభాల్లో ఉన్న సూచీలు.. కొద్దిసేపటికే దిగొచ్చాయి. ఇరు దేశాల మధ్య బాంబుల మోతలకు తోడు క్రూడాయిల్ ధరలు భగ్గుమనడం మదుపరులను కలవరపెట్టింది.
ప్రస్తుతం బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 118.61 డాలర్లుగా ఉంది. ఈ ఒక్కరోజే 4 డాలర్లకు పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముగింపులో, సెన్సెక్స్ 366.22 పాయింట్లు క్షీణించి 55,102.68 వద్ద స్థిరపడితే , నిఫ్టీ 108 పాయింట్లు లేదా 0.65% క్షీణించి 16,498 వద్ద ఉంది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.97 వద్ద ఉంది.
నిఫ్టీలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, విప్రో, టెక్ మహీంద్రా, ఐటీసీ, హెచ్సీఎల్ టెక్ షేర్లు రాణిస్తే.. అల్ట్రా టెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనిలీవర్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, మారుతీ డీలాపడ్డాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్ & బ్యాంక్ రంగాలలో సూచీలు 1-2 శాతం పడిపోగా, ఎఫ్ఎంసిజి & రియాల్టీ సూచీలు ఒక్కొక్కటి 0.5 శాతం తగ్గాయి. అయితే మెటల్, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ సూచీలు 1-2 శాతం పెరిగాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.35 శాతం పెరిగాయి.