దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. గత వారం లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ ఈ రోజు కూడా లాభాలతో ముగిసింది. రష్యా – ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ వాతావరణం వల్ల గత వారం స్టాక్ మార్కెట్ తీవ్రంగా నష్టపోయింది. దీంతో షేర్లు కనిష్టాల వద్ద లభిస్తుండటంతో మదుపరులు షేర్లను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపడటంతో నష్టాలతో ప్రారంభమైన సూచీలు క్రమ క్రమంగా పుంజుకున్నాయి. ముగింపులో, సెన్సెక్స్ 388.76 పాయింట్లు లాభపడి 56,247.28 వద్ద స్థిర పడితే, నిఫ్టీ 135.50 పాయింట్లు. లాభపడి 16,793.90 వద్ద ఉంది.
నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.35 వద్ద ఉంది. నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, జెఎస్ డబ్ల్యు స్టీల్, బీపీసీఎల్ షేర్లు రాణిస్తే.. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఎం అండ్ ఎం, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు నష్ట పోయాయి. ఆటో & బ్యాంక్ మినహా ఇతర అన్ని సెక్టార్ సూచీలు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 0.8 శాతం పెరిగాయి.