ఏపీ కర్ప్యూలో సడలింపులు

ఏపీ కర్ప్యూలో సడలింపులు

కరోనా కేసుల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కర్ప్యూకు సంబంధించి కొంత సడలింపులు పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు అమలవుతున్న విధానానికి భిన్నంగా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కర్ఫ్యూ సడలింపులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ కొత్త విధానం జూన్ 20 నుంచి 30వ తేదీ వరకు ఉంటాయి.ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు అన్ని రకాల షాపులుమూసి వేయాల్సి ఉంటుంది. సాయంత్రం ఆరు గంటల నుంచి కర్ఫ్యూ కచ్ఛితంగా అమలవుతుందని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల్లో ఒక్క తూర్పుగోదావరి జిల్లా తప్పించి మిగిలిన 12 జిల్లాల్లో ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు.ఇక.. తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ సడలింపులు ఇవ్వనున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు మాత్రం దీనికి తగ్గట్లే నడుస్తాయి. ఉద్యోగులంతా ఆఫీసులకు రావాల్సి ఉంటుంది. అయితే.. కర్ప్యూ సడలింపు విషయంలో ఏపీ సీఎం జగన్ కాస్త తొందరపడినట్లుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ తగ్గుతున్నాయి.

గత నెలలో ఇదే సమయానికి రోజువారీ కేసులు 4 గంటల వరకు ఉండగా.. తాజాగా 60 వేలకు తగ్గిపోయాయి.ఇంతలా కేసులు తగ్గినప్పటికి.. దేశంలో కేసులు ఎక్కువగా నమోదవుతున్న టాప్ 5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉంది. తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం జనాభాలో 40 శాతానికి పైనే హైదరాబాద్ మహా నగరంలోనే ఉన్నారు. లక్కీగా హైదరాబాద్ మహా నగరంలో నమోదవుతున్న కేసులు కూడా బాగా తగ్గిపోయాయి. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కూడా కేసులు తక్కువగానే నమోదవుతున్నాయి.

తెలంగాణతో పోలిస్తే ఏపీ పరిస్థితి భిన్నం. రాష్ట్రంలోని విశాఖ.. విజయవాడ నగరాలు మినహా మిగిలిన అన్ని చోట్ల జనాభా కాస్త అటూ ఇటూగా ఒకేలా ఉంటారు. ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ కేసుల నమోదు ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో కర్ఫ్యూను సాయంత్రం ఆరు గంటలకు పొడిగించకుండా మరి కొంత కాలం పాత పద్దతిలోనే అమలు చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేసుల సంఖ్య మరింత తగ్గుముఖం పట్టిన తర్వాత కర్ఫ్యూను సడలించి ఉంటే బాగుండేదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.