ఉత్తర్‌ప్రదేశ్‌లోని గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 27 మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. బారాబంకి జిల్లాలోని బాబురి గ్రామం వద్ద బస్సు, ట్రక్కు ఒకదానికొకటి ఢీకొట్టాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. ఢిల్లీ నుంచి బహ్రయిచ్‌కు వెళ్తున్న బస్సు.. బారాబంకి జిల్లా బాబురి వద్దకు చేరుకున్నప్పుడు ఎదురుగా వస్తున్న ఓ భారీ ట్రక్కు అదుపుతప్పి ఢీకొట్టింది.
ప్రయాణికులు నిద్రలో ఉండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇసుక లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు.. బస్సుపైకి దూసుకెళ్లినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసు అధికారులు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బారాబంకి జిల్లా కలెక్టర్ ఆదర్శ్‌సింగ్, ఎస్పీ యమునా ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు పర్యవేక్షించారు.
క్షతగాత్రులను బారాబంకి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉన్నవారిని మెరుగైన వైద్యం కోసం లక్నోకు తరలించారు. ఈ ప్రమాదంపై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. గాయపడిన వారికి చికిత్స కోసం రూ.50 వేలు చెల్లించనున్నట్లు చెప్పారు.