‘నిశ్శబ్దం’ సినిమా రిలీజ్ సమయం….

‘నిశ్శబ్దం’ సినిమా రిలీజ్ సమయం....

దక్షిణాదిన థియిేట్రికల్ రిలీజ్‌ను స్కిప్ చేసి నేరుగా ఓటీటీల్లో రిలీజైన అతి పెద్ద సినిమా అంటే ‘వి’నే. ఈ సినిమా ఇలా ముందుకు రాగానే.. మరికొన్ని పేరున్న సినిమాలు ఓటీటీ రిలీజ్‌కు సై అనేశాయి. వాటిలో ప్రముఖంగా వినిపించిన పేరు.. నిశ్శబ్దం. అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ రూపొందించిన ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుందని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది.

ఇందులో నిర్మాణ భాగస్వామి అయిన కోన వెంకట్ కూడా ఈ దిశగా ఈ మధ్య సంకేతాలు ఇచ్చాడు. కానీ ఇప్పటిదాకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. మంచి డీల్ కోసం ఓటీటీలతో చిత్ర బృందం చర్చలు జరుపుతోందని, త్వరలోనే డీల్ ఓకే అవుతుందని ఇండస్ట్రీ జనాలు చెప్పుకుంటూ వచ్చారు. ఐతే ఎట్టకేలకు డీల్ ఓకే అయిందని.. రిలీజ్ డేట్ కూడా దాదాపు ఖరారైందని.. అతి త్వరలో ఈ మేరకు ప్రకటన కూడా రాబోతోందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

ఒక టాప్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ‘నిశ్శబ్దం’ సినిమాను రిలీజ్ చేయడానికి అగ్రిమెంట్ కుదుర్చుకుందని.. అక్టోబరు 2న గాంధీ జయంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయొచ్చని అంటున్నారు. దక్షిణాది సినిమాలపై ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్న అమేజాన్ ప్రైమ్ వాళ్లే ఈ సినిమాను సొంతం చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. అక్టోబరు 2న రాజ్ తరుణ్ సినిమా ‘ఒరేయ్ బుజ్జిగా’ను ‘ఆహా’లో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఐతే ‘నిశ్శబ్దం’తో పోలిస్తే అది చిన్న సినిమా కావడం, పైగా థియేటర్లలో మాదిరి క్లాష్‌కు అవకాశం లేదు కాబట్టి అదే రోజు అనుష్క సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారని అంటున్నారు. ఈ డేట్ మిస్ అయితే మళ్లీ మంచి ముహూర్తం అంటే దసరానే. అక్టోబరు 25 వరకు ఆగాలి. మరి ఏం చేస్తారో చూడాలి. ఒకట్రెండు రోజుల్లోనే ‘నిశ్శబ్దం’ ఓటీటీ రిలీజ్ గురించి ప్రకటన రావచ్చని అంటున్నారు.