నివర్‌ తుపాను తీవ్ర ప్రభావం

నివర్‌ తుపాను తీవ్ర ప్రభావం

నివర్‌ తుపాను అతి తీవ్రంగా ప్రభావం చూపడంతో బుధవారం రాత్రి నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలతో కొన్ని జిల్లాల్లో పరిస్థితి అతలాకుతలంగా మారింది. చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో ఊహించనంతగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రహదారులు వాగులను తలపిస్తున్నాయి. తిరుపతి, నెల్లూరు నగరాల్లో లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. పెన్నా, కుందూ స్వర్ణముఖి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

పలుచోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. అధికార యంత్రాంగం, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. జాతీయ విపత్తు సహాయ దళాలు, రాష్ట్ర విపత్తు సహాయ దళాలు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారడంతో అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు అధికారులను ఆదేశించారు.