పొంచి ఉన్న మరో ముప్పు

పొంచి ఉన్న మరో ముప్పు

నివర్‌ తుపాన్‌ నీలినీడలు జనాన్ని వీడేలోగా మరో ముప్పు పొంచి ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి. డిసెంబర్‌ 11వ తేదీన వాయుగుండం లేదా తుపాన్‌ తమిళనాడు సముద్రతీరాన్ని కుదిపేయగలదని సమాచారం. బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్‌ తుపాన్‌ ఈనెల 26వ తేదీ తెల్లవారుజామున పుదుచ్చేరికి సమీపంలో తీరందాటుతూ పరిసరాలను అతలాకుతలం చేసింది. శుక్రవారం కొద్దిగా తెరపి ఇవ్వడంతో పుదుచ్చేరి, తమిళనాడు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

ఇదిలాఉండగా బంగాళాఖాతం ఆగ్నేయంలో మరో 48 గంటల్లో కొత్తగా అల్పపీడన ద్రోణి ఏర్పడనుందని, ఈ అల్పపీడన ద్రోణి మరో 24 గంటల్లో వాయుగుండంగా మారి తమిళనాడువైపు పయనించగలదని చెన్నై వాతావరణ కేంద్రం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బాలచంద్రన్‌ శుక్రవారం తెలిపారు. ఈ ప్రకటనతో జనం మరోసారి ఉలిక్కిపడ్డారు. నివర్‌ తుపాన్‌ తీరందాటిన ప్రభావంతో ఈనెల 30వ తేదీ వరకు ఓ మోస్తరు నుంచి భారీ, అతిభారీ వర్షాలు కురుస్తాయని ముందుగానే ప్రకటించారు. అయితే, కొత్తగా ఏర్పడనున్న వాయుగుండం వల్ల డిసెంబర్‌ 3వ తేదీ వరకు వర్షాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు.

అయితే ఈ వాయుగుండం తుపానుగా రూపాంతరం చెందే అవకాశం లేదని ఆయన స్పష్టం చేయగా, 11వ తేదీ నాటికి తుపానుగా మారి తమిళనాడు సముద్రతీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొనడం గమనార్హం. సముద్రతీరాల్లో శీతోష్ణస్థితి అధికంగా ఉన్నందున తుపానుగా మారే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ప్రముఖ వాతావరణ నిపుణులు ప్రదీప్‌జాన్‌ అంటున్నారు. వాయుగుండం ఏర్పడుతుంది, అది తుపానుగా మారకుండా బలహీనపడవచ్చని వాతావరణ నిపుణులు తెలిపారు. వాయుగుండం ఖాయమని తెలుస్తున్నందున వచ్చేనెల 11వ తేదీ వరకు బలమైన వర్షాలు పడతాయని ఆయన చెప్పారు.