Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఈ సినిమాను మార్చి చివర్లో లేదా ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. సుకుమార్ గత చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ‘రంగస్థలం’పై కూడా అంచనాలు అమాంతం పెరిగి పోయాయి. అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందనే నమ్మకంను ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. ఇక రంగస్థలం తర్వాత చరణ్ చేయబోతున్న సినిమా ఏంటీ అనే విషయంలో గత కొన్ని రోజులుగా కన్ఫ్యూజన్ నెలకొంది.
చరణ్ తర్వాత సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేస్తాడని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ చేస్తోన్న ‘భరత్ అను నేను’ చిత్రం వేసవి కానుకగా విడుదల కాబోతుంది. మహేష్‌బాబుతో సినిమా పూర్తి అవ్వడమే ఆలస్యం వెంటనే చరణ్‌తో మూవీని కొరటాల ప్రారంభిస్తాడని రెండు మూడు నెలల క్రితం ప్రకటన వచ్చింది. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చరణ్ తర్వాత చిత్రం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఉండబోతుందట.
ఈనెల 20న చరణ్, బోయపాటిల కాంబో మూవీకి క్లాప్ కొట్టేందుకు సిద్దం అవుతున్నారు. చరణ్ మరి కొన్ని రోజుల్లోనే రంగస్థలం చిత్రీకరణ పూర్తి చేసుకుంటాడు. ఆ వెంటనే బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తాడని సినీ వర్గాల వారి నుండి సమాచారం అందుతుంది. వచ్చే సంవత్సరం దసరాకు బోయపాటి, చరణ్‌ల కాంబో మూవీ విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. మరి కొరటాల శివతో సినిమా ఎప్పుడుంటుందో చూడాలి. గతంలో చరణ్, కొరటాల శివల కాంబోలో ఒక చిత్రం పూజా కార్యక్రమాలు జరుపుకుని క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు వార్తల్లోకి వచ్చి వెంటనే క్యాన్సిల్ అయ్యింది. ‘భరత్ అను నేను’ సక్సెస్ అయితే చరణ్ వెంటనే కొరటాలకు పిలిచి డేట్లు ఇస్తాడేమో చూడాలి.