గుడ్లలో నాణ్యత ఉండటం లేదు

గుడ్లలో నాణ్యత ఉండటం లేదు

చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషక లోపాలు అధిగమించేందుకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పౌష్టికాహార పంపిణీ చేస్తోంది. ఒక్కో లబ్ధిదారుకు ప్రతినెలా 16 కోడిగుడ్లను అందించాలి. గుడ్లయితే ఇస్తున్నారు కానీ… అందులో నాణ్యత ఉండటం లేదు. ఫలితంగా ఉన్నతమైన లక్ష్యంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న పౌష్టికాహార లక్ష్యానికి గండిపడుతోంది. కోట్లాది రూపాయల ఖర్చుతో నిర్వహిస్తున్న కార్యక్రమం పర్యవేక్షణా లోపంతో గాడితప్పుతోంది.

రాష్ట్రంలో 149 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 31,711 ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు, 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో 21,59,988 మంది చిన్నారులు, గర్భిణులు, బాలింతలు నమోదయ్యారు. ఇందులో 4,57,643 మంది గర్భిణులు, బాలింతలు కాగా, ఏడు నెలల నుంచి 3సంవత్సరాల లోపు చిన్నారులు 10,34,562 మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు ఉన్న చిన్నారులు 6,67,783 మంది ఉన్నారు.

ఒక్కో లబ్ధిదారులకు నెలకు 16 గుడ్లు అందిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేస్తున్న గుడ్లు 3.45 కోట్లు. ఇందుకోసం రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఏటా సగటున రూ.150కోట్ల మేర నిధులను కోడిగుడ్లపైనే ఖర్చు చేస్తోంది. ఇంతటి భారీ బడ్జెట్‌తో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంపై నిఘా లోపించింది.అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్లు సరఫరా చేస్తున్నప్పటికీ… దాదాపు ఏడాదిన్నరగా ఎలాంటి పర్యవేక్షణా లేదు.

ఇది కాంట్రాక్టర్లకు వరంగా మారింది. సాధారణంగా ఒక గుడ్డు 50గ్రాములుండాలి. కానీ కాంట్రాక్టర్లు పంపిణీ చేస్తున్న గుడ్లు చాలావరకు నాసిరకంగా ఉంటున్నాయి. తక్కువ ధరకు దొరికే… తక్కువ పరిమాణంలో ఉన్న, మురిగిపోయిన గుడ్లు సరఫరా చేస్తున్నారు. గుడ్లు చిన్నగా ఉంటున్నాయని, ఉడికించిన గుడ్లనుంచి దుర్గంధం వస్తోందని అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ ఫిర్యాదులు సీడీపీఓలు, జిల్లా సంక్షేమాధికారులు, రాష్ట్ర కార్యాయానికి సైతం వెల్లువెత్తాయి. చివరకు ఈ అంశం మంత్రి సత్యవతి రాథోడ్‌ దృష్టికి వచ్చింది.

కోడిగుడ్ల పంపిణీ క్షేత్రస్థాయి నుంచి వస్తున్న ఫిర్యాదులు, నాణ్యతాలోపాలపై మీడియాలో వస్తున్న వార్తలు చూసి ఇటీవల మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నివేదిక ఇవ్వాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఒకట్రెండు రోజుల్లో నివేదిక అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నివేదిక అందిన తర్వాత సమీక్షించి నాసిరకం గుడ్లు సరఫరా చేసిన కాంట్రాక్టర్లపై వేటు వేయాలని, కాంట్రాక్టర్ల ఎంపికలో కఠిన నిబంధనలు విధించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.