క్రిష్ తెరకెక్కిస్తున్న ‘ఎన్టీఆర్’ చిత్రం ప్రస్తుతం టాలీవుడ్లో క్రేజీ చిత్రంగా మారిపోయింది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌లు విడుదల చేసినప్పటి నుండి ఆసక్తి నెలకొంటుంది. ‘ఎన్టీఆర్’ చిత్రాన్ని రెండు పార్టులుగా తెరకెక్కిస్తూ జనవరిలో సంక్రాంతి కానుకగా మొదటి పార్టు, రిపబ్లిక్ డే సందర్భంగా రెండో పార్టును విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించారు. అయితే ‘ఎన్టీఆర్’ స్క్రిప్టును ఇప్పుడు కాస్త మారుస్తున్నారని, అందుకే ఈ చిత్రం ముందుగా అనుకున్న సమయానికి విడుదల కావడం కష్టమే అని తాజాగా వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. అయితే ఆ వార్తలన్నీ కూడా పుకార్లే, వాటిల్లో ఏమాత్రం నిజం లేదని యూనిట్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. అనుకున్న సమయానికే రెండు పార్టులు కూడా విడుదల అవడం ఖాయమని తెలుస్తోంది.
‘ఎన్టీఆర్’ చిత్రం వాయిదా పడుతుంది అనడంతో నందమూరి అభిమాను కాస్త నిరాశకు లోనయ్యారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటగా రాసుకున్న స్క్రిప్టులో అక్షరం కూడా మార్చడం లేదనే టాక్ వినిపిస్తోంది. తాజా రాజకీయాల పరిణామాల దృఫ్ట్యా స్క్రిప్టులో మార్పులు వస్తాయని అంతా ఊహించారు. కానీ మొదటగా ప్లాన్ చేసుకున్నట్టుగానే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో బాలక్రిష్ణ నటిస్తుండగా ఆయన సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్ తార విద్యాబాలన్ నటిస్తోంది. శ్రీదేవిగా రకుల్, జయప్రదగా తమన్నాలు కనిపించనున్నారు.