ప్రముఖ ర్యాపర్, టాలీవుడ్ నటుడు నోయల్ మంగళవారం అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. భార్య ఎస్తర్ నుంచి తాను విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇప్పటికే డివోర్స్ కోసం దరఖాస్తు చేశామని, కోర్టు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు. అభిప్రాయ భేదాల కారణంగా తాము విడిపోతున్నామని, తమ మధ్య ఉన్న అందమైన బంధాన్ని, దాని విలువను కాపాడుకునేందుకు ఇదే సరైన నిర్ణయమని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
ఎస్తర్ భవిష్యత్ బాగుండాలని, తనకు అంతా మంచే జరగాలని, తను కన్న కలలు నిజం కావాలని ఆకాంక్షించాడు. విడాకుల విషయంలో తన కుటుంబాన్ని గానీ, ఎస్తర్‌ను గానీ ఇబ్బంది పెట్టేలా వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేశాడు. అలాగే కష్ట సమయాల్లో తనకు తోడుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి నోయల్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. సరికొత్త ఆశలతో కొత్త జీవితానికి స్వాగతం పలికేందుకు సిద్ధమైనట్లు పేర్కొన్నాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ నోట్‌ను షేర్ చేశాడు.
కాగా ప్రముఖ డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించిన ‘వెయ్యి అబద్ధాలు’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఎస్తర్- నోయెల్ గతేడాది వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ప్రేమపెళ్లి చేసుకున్న ఈ జంట మధ్య గత కొంతకాలంగా సఖ్యత చెడిందని రూమర్లు వినిపించాయి. ఇక ఈ రోజు నోయల్ తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో వదంతులు నిజమేనని నిరూపితమైంది.
ఇక కెరీర్ విషయానికొస్తే ఎస్తర్ తెలుగు, తమిళ్, మరాఠీతో పాటు హిందీ సినిమాలతో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. అట్టహాసంగా ప్రారంభం కానున్న తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4లో నోయెల్ పాల్గొనున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అంతేగాక షో కోసం క్వారంటైన్లో ఉన్న అతడికి ఇటీవల కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వార్తలు వినిపించాయి. అయితే నోయెల్ వాటన్నింటినీ కొట్టిపడేశాడు.