Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై ఉత్తరకొరియా మరోసారి విరుచుకుపడింది. ట్రంప్ తమపై యుద్ధం చేద్దామని ఇతర దేశాలను అడుక్కుంటున్నాడు అని ఉత్తరకొరియా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ట్రంప్ ఆసియా పర్యటనను లక్ష్యంగా చేసుకుని ఉత్తరకొరియా విమర్శలు గుప్పించింది. ఆసియా పర్యటనలో ట్రంప్ నిజస్వరూపం బయటపడిందని, ప్రపంచ శాంతి, స్థిరత్వాన్ని నాశనం చేయాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారని ఉత్తరకొరియా విదేశాంగ శాఖ ప్రతినిధి ఆరోపించారు. కొరియన్ ద్వీపకల్పంపై అణుయుద్ధం చేద్దామని ఆయన ఇతర దేశాలను అడుక్కుంటున్నాడని ఎద్దేవా చేశారు. ట్రంప్ ఇలాంటి వైఖరితో తమ దేశ అణ్వాయుధ కార్యక్రమాలను ఏమాత్రం అడ్డుకోలేరని స్పష్టంచేశారు. ఆసియా పర్యటనలో భాగంగా దక్షిణ కొరియాలో పర్యటించిన ట్రంప్ ఉత్తరకొరియాను ఉద్దేశించి తీవ్ర హెచ్చరికలు చేశారు.
అమెరికాను తక్కువ అంచనా వేయొద్దని ఆ దేశానికి సూచించారు. బెదిరింపులకు భయపడేది లేదని, గతంలో జరిగిన ఘోరాలను మళ్లీ జరగనిన్వనని స్ఫష్టంచేశారు. అణుదాడులతో భయపెట్టే దుష్టులను ప్రపంచం సహించబోదన్నారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ కు కూడా ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్, లిబియా మాజీ అధ్యక్షుడు గడాఫీ లకు పట్టిన గతే పడుతుందని వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య కొన్నాళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ప్రపంచ దేశాలు మాత్రం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని రెండు దేశాలపై ఒత్తిడి పెంచుతున్నాయి.