ఉత్తర కొరియాలో నియంతృత్వం రాజ్యమేలుతోంది. అధినేత కిమ్ జోంగ్ ఉన్ కనుసన్నలతో ప్రజలను శాసిస్తూ ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన నేతల్లో ఒకరుగా గుర్తింపు పొందారు. ఎక్కడాలేని విధంగా ప్రజలపై కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ విధానాలను విమర్శించినా.. వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నా వారి పని అయిపోయినట్టే. కరోనా కారణంగా దేశంలో ఆహార ఉత్పత్తి తగ్గిపోయిందని, ప్రజలు తక్కువ తినాలంటూ కొద్ది నెలల కిందటే కిమ్ ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే.
వివాదాలతో తరుచూ వార్తల్లో నిలిచే ఉత్తర కొరియా అధినేత.. తాజాగా, తన తుగ్లక్ నిర్ణయంతో ప్రపంచాన్ని మరోసారి నివ్వేరపోయేలా చేశారు. తన తండ్రి, ఉత్తర కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఇల్ మరణించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన సస్మరనార్థం దేశంలో 11 రోజులపాటు సంతాప దినాలు పాటించాలని ఆదేశాలు జారీచేశారు. ఈ సమయంలో ప్రజలెవ్వరూ సంతోషంగా గడపడం.. ముఖ్యంగా నవ్వడం, ఆల్కహాల్ సేవించడం, పుట్టిన రోజు వేడుకలు చేసుకోవడంపై నిషేధం విధించారు.
‘సంతాప దినాలు సమయంలో మద్యం సేవించడం, నవ్వడం, వేడుకల్లో పాల్గొవడం నిషేధం’ అంటూ ఉత్తర కొరియా ఈశాన్య సరిహద్దు నగరం సినౌజులో రేడియో ఫ్రీ ఆసియా ప్రకటించింది.అంతేకాదు, డిసెంబర్ 17న కిమ్ జాంగ్ 10వ వర్థంతి రోజున ప్రజలు నిత్యావసర వస్తువులు కూడా కొనరాదని కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సంతాప దినాలు పాటించే 11 రోజులు ఎవరైనా చనిపోయినా వారి కుటుంబసభ్యులు బిగ్గరగా ఏడవరాదు. చనిపోయివారి మృతదేహానికి హడావుడి లేకుండా అంత్యక్రియలు పూర్తిచేయాలి. ఇంట్లో ఎవరిదైనా పుట్టిన రోజు ఉంటే వేడుకలు చేసుకోరాదని అల్టిమేటం జారీచేశారు.
కిమ్ జోంగ్ ఉన్ నియంత పోకడ తండ్రి నుంచి వారసత్వంగానే వచ్చింది. కిమ్ జోంగ్ ఇల్ కూడా 1994 నుంచి 2011 వరకు 17 ఏళ్ల పాటు ఉత్తర కొరియాను పాలించారు. దేశ ప్రజలను కాల్చుకుని తిని, నరకం చూపించాడు. అక్కడి ప్రజలు అత్యంత దుర్బర జీవితం గడిపారు. చివరకు 69 ఏళ్ల వయస్సులో 2011 డిసెంబర్ 17న కిమ్ జాంగ్ గుండెపోటుతో కన్నుమూశాడు. తండ్రి మరణం తర్వాత మూడో కుమారుడైన కిమ్ జోంగ్ ఉన్ పాలనాపగ్గాలు చేజిక్కించుకున్నాడు.
అధికారంతో పాటు తండ్రి నియంత పోకడలను వారసత్వంగా పొందిన కిమ్.. నవ్వితే తప్పు, ఏడిస్తే తప్పు.. ఆఖరికి తన మాటను గౌరవించకుండా సంతోషంగా ఉన్నా తప్పేనంటూ హుకుం జారీ చేశారు. గతంలో సంతాప దినాలు సందర్భంగా మద్యం సేవించినా లేదా సంతోషంగా గడిపినా అంటువంటి వారిని అరెస్ట్ చేసి దారుణంగా శిక్షించారు. తర్వాత వారి ఆచూకీ కనిపించకుండా పోయింది.