ఉత్తర కొరియా మారోసారి దుందుడుకు వైఖరి ప్రదర్శించింది. సుదూర లక్ష్యాన్ని చేధించే క్రూయిజ్ క్షిపణిని వారాంతంలో పరీక్షించినట్టు ఉత్తర కొరియా మీడియా సోమవారం వెల్లడించింది. ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై అమెరికాతో సుదీర్ఘ ప్రతిష్టంభన మధ్య ఇది ‘గొప్ప ప్రాధాన్యత కలిగిన వ్యూహాత్మక ఆయుధం’ అని అభివర్ణించింది. క్షిపణి ప్రయోగానికి సంబంధించిన ఫోటోలను ఉత్తర కొరియా అధికారిక పత్రిక రొడాంగ్ సిన్మన్ ప్రచురించింది. ప్రయోగ వాహనంపై ఉన్న ఐదు ట్యూబ్లలో ఒకదాని నుంచి క్షిపణి నిష్క్రమిస్తున్నట్టు ఇందులో ఉంది.
ఉత్తర కొరియా తన సైనిక కార్యక్రమాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా క్షిపణులను పరీక్షించి పొరుగు దేశాలు, అంతర్జాతీయ సమాజాన్ని బెదిరింపులకు గురిచేసే ప్రయత్నాలపై దృష్టి సారించిందని యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇటువంటి ప్రయోగాలు ఉత్తర ఆయుధాల సాంకేతికతలో గణనీయమైన పురోగతిని సూచిస్తుందని విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా, క్షిపణి పరీక్షలను శనివారం, ఆదివారం రెండు రోజులు నిర్వహించినట్టు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
ప్రయోగ స్థానం నుంచి క్షిపణి 1,500 కిలోమీటర్ల ప్రయోగించి ఉత్తర కొరియా ప్రదేశిక జలాలు దాటి లక్ష్యాన్ని చేరుకుందని కేసీఎన్ఏ పేర్కొంది. ‘గొప్ప ప్రాముఖ్యత కలిగిన వ్యూహాత్మక ఆయుధం’ పరీక్షలు విజయవంతమయ్యాయని, ఇది శత్రు మూకలను నిరోధించే మరో ప్రభావవంతమైన ఆయధం అని వ్యాఖ్యానించింది. ఉత్తర కొరియా అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి.. అమెరికా దండయాత్ర నుంచి రక్షించాల్సిన అవసరం ఉందని చెప్పింది.
అయితే, క్రూయిజ్ క్షిపణులను ఉత్తర కొరియా అభివృద్ధి చేయడంపై మాత్రం నిషేధించలేదు. గతంలోనూ ఈ దేశం ఇటువంటి క్షిపణులను పరీక్షించింది.క్షిపణి పరీక్ష గణనీయమైన ముప్పును సూచిస్తోందని ఎవా ఉమెన్స్ యూనివర్సిటీలో ఉత్తర కొరియా స్టడీస్ ప్రొఫెసర్ పార్క్ వాన్-గాన్ అన్నారు. ఉత్తర కొరియా అణ్వాయుధాలను సూక్ష్మీకరిస్తే క్రూయిజ్ క్షిపణులకు కూడా వాటిని అమర్చవచ్చు.. వివిధ ఆయుధ వ్యవస్థల అభివృద్ధికి మరిన్ని పరీక్షలు జరిగే అవకాశం ఉంది అని ఆయన అన్నారు.
గత నెలలో జరిగిన దక్షిణ కొరియా-అమెరికా సైన్యం సంయుక్త విన్యాసాలకు ఈ ప్రయోగం ఉత్తర ప్రతిస్పందనను తెలియజేస్తుందని ఆయన చెప్పారు. కానీ, చైనా విదేశాంగ మంత్ర వాంగ్ యీ వాదన మరోలా ఉంది. క్రూయిజ్ క్షిపణులను ఉత్తర కొరియా పరీక్షించడం వెనుక అమెరికా, చైనాలను రెచ్చగొట్టే ప్రయత్నం కాదని అన్నారు. మిడిల్బరీ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్‌కు చెందిన జెఫ్రీ లూయిస్ మాట్లాడుతూ.. తాజా క్షిపణులు దక్షిణ కొరియా, జపాన్ అంతటా లక్ష్యాలకు వ్యతిరేకంగా వార్‌హెడ్‌ను అందించగలవని అన్నారు.