Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఉత్తరకొరియాలో నియమనిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడి పౌరులపైనే కాకుండా… సరిహద్దుల్లో పహారా కాసే సైనికులపైనా..తీవ్ర ఆంక్షలు అమలుచేస్తుంది కిమ్ జాంగ్ ఉన్ ప్రభుత్వం. ఎవరు కాస్త సందేహాస్పదంగా కనిపించినా..ఏ మాత్రం అనుమానాస్పదంగా వ్యవహరించినా..వారి ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. అందుకే అక్కడి ప్రజలు, సైనికులు ప్రభుత్వఆదేశాలను తు.చ తప్పకుండా పాటిస్తారు. అధ్యక్షుడు కిమ్ పై వినయవిధేయతలు ప్రదర్శిస్తారు. అప్పుడప్పుడు మాత్రం కొందరు నిబంధనలు అతిక్రమించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు.
తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఉత్తరకొరియా సైనికుడు ఒకరు సరిహద్దు దాటి దక్షిణ కొరియా వెళ్లబోయినందుకు సొంత సైన్యం అతనిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. దీనికి సంబంధించిన వీడియోను యునైటెడ్ నేషన్స్ కమాండ్ విడుదలచేసింది. ఈ నెల 13న ఉత్తరకొరియా సరిహద్దులోని పన్ మున్ జామ్ గ్రామం వద్ద ఓ సైనికుడు తన వాహనంలో దక్షిణకొరియా వైపు వెళ్లబోయాడు. ఇది గమనించిన మిగతా సైనికులు అతన్ని వెంబడించి అడ్డుకున్నారు. దీంతో ఆ సైనికుడు వాహనం దిగి పరుగులు తీయగా…ఇతర జవాన్లు అతడిని ఆయుధాలతో వెంబడించి కాల్పులు జరిపారు.
కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆ సైనికుడిని దక్షిణ కొరియాకు చెందిన ముగ్గురు సైనికులు కాపాడి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని గురించి కచ్చితమైన సమాచారం తెలియడం లేదు. అయితే..దక్షిణ కొరియా ఆస్పత్రిలో ఆ సైనికుడు చికిత్స పొందుతున్నాడని, ఆ వివరాలను రహస్యంగా ఉంచుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ కాల్పులపై ఐక్యరాజ్యసమితి దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. దీనిపై దర్యాప్తు చేపట్టేందుకు, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు చర్చలకు రావాలని ఉత్తరకొరియాను కోరింది. అటు కిమ్ జాంగ్ ఉన్ ఉత్తరకొరియా ప్రజలపై కూడా కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నట్టు దక్షిణ కొరియా నిఘావర్గాలు వెల్లడిస్తున్నాయి.
ప్రజలు వినోదాత్మక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కిమ్ ఆదేశించినట్టు సమాచారం. అలాగే ప్రజలు గుంపులు గుంపులుగా ఉండడాన్ని కూడా నిషేధించారు. మద్యపానం, పాటలు పాడడం వంటిపై కూడా నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. వీటివల్ల ప్రజలపై పట్టుపెరగడమే కాకుండా…ఐక్యరాజ్యసమితి విధించిన ఆర్థిక ఆంక్షల ప్రభావాన్ని ఎదుర్కోవచ్చని కిమ్ భావిస్తున్నాడన్నది దక్షిణ కొరియా ఆరోపణ. అయితే ఉత్తరకొరియా మద్దతు దారులు మరోలా వాదిస్తున్నారు. అమెరికా, దక్షిణ కొరియా ఉత్తరకొరియాపై యుద్ధం చేయాలన్న ఉద్దేశంలో ఉన్నాయని, ఇందుకోసం ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టేందుకు కిమ్ పై ఉన్నవీ లేనివీ కల్పించి ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.