ఎన్డీయేకి ఇక కష్ట కాలమే…!

NPP May Snap Ties With BJP Led NDA Over Citizenship Bill

పౌరసత్వ సవరణ బిల్లు దేశంలో కలకలం రేపుతోంది. దక్షిణాదికి ఆ ఎఫెక్ట్ లేదు కానీ ఈశాన్య రాష్ట్రాల్లో ఈ బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. అస్సాంలో అయితే ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతున్నాయి. ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎన్డీయేలో ఉన్న పలు పార్టీలు కూడా బిల్లును వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ బిల్లు కారణంగా మరో పార్టీ కూడా ఎన్డీయే కూటమి నుంచి వైదొలడానికి సిద్ధమైంది. బీజేపీ సర్కార్ మొండి వైఖరిని నిరసిస్తూ మేఘాలయకు చెందిన నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ) కూడా ఎన్డీయేకు గుడ్‌బై చెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పౌరసత్వ సవరణ బిల్లు-2018కు లోక్‌ సభలో ఆమోదం తెలపడంతో అసోం గణ పరిషత్‌ (ఏజీపీ) ఇప్పటికే ఎన్డీయేతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇప్పుడు అదే కోవలో ఎన్‌పీపీ కూడా కమలం పార్టీకి కటీఫ్ చెప్పడానికి సిద్ధమైంది. దీంతో సార్వత్రిక ఎన్నికల ముందు ఎన్డీయే కూటమికి చిక్కులు ఏర్పడ్డాయి. ఈ బిల్లును మేఘాలయ సీఎం కన్రాద్‌ సంగ్మా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీతో పొత్తును తెగదెంపులు చేసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. పార్టీ నేతలతో చర్చలు జరిపిన అనంతరం దీనిపై నిర్ణయం వెల్లడించనున్నారు. ప్రస్తుతం ఎన్‌పీపీ 5 ఈశాన్య రాష్ట్రాల్లో ఉందని తెలిపారు. ఈ బిల్లు పాస్ అయితే పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఈ దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన వారికి భారత పౌరసత్వం కల్పించాలన్న ప్రతిపాదనను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.