కో–లొకేషన్ కుంభకోణం కేసులో ఆదివారం రాత్రి అరెస్టయిన నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ మాజీ చీఫ్ చిత్రా రామకృష్ణను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏడు రోజుల కస్టడీకి తీసుకుంది. తగిన విచారణకు ఆమె కస్డడీ అవసరమని సీబీఐ చేసిన విజ్ఞప్తికి అనుగుణంగా ఇక్కడ ప్రత్యేక జడ్జి సంజీవ్ అగర్వాల్ ఆదేశాలు ఇచ్చారు. 2022 మార్చి 14వ తేదీన ఆమెను తిరిగి కోర్టు ముందు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.
స్టాక్ ఎక్సేంజీలో కొందరు బ్రోకర్ల సర్వర్లకు ట్రేడింగ్‌కు సంబంధించి మార్కెట్ సమాచారం ముందుగా చేరేట్లు చేయడం, ఒక అదృశ్య యోగితో ఆమె ఎన్ఎస్ఈకి సంబంధించి కీలక విధాన నిర్ణయాలను పంచుకోవడం, ఆమె నిర్ణయాల్లో యోగి పాత్ర ఉందన్న వార్తలు సంచలనం కలిగించాయి. ఎన్ఎస్ఈ చీఫ్‌గా చిత్రా రామకృష్ణ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు సెబీ నివేదిక ఇటీవలే తేల్చింది.
సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారం చిత్రా పెట్టుకున్ ముందస్తు బెయిల్ దరఖాస్తును తిరస్కరించిన మర్నాడే అధికారులు అరెస్ట్ చేయడం గమనార్హం. అంతకుముందు మూడు రోజులుగా అధికారులు ఆమె నివాసాల్లో తనిఖీలు నిర్వహించారు. ఎన్ఎస్ఈ కొలోకేషన్ కేసులో సీబీఐ 2018 నుంచి దర్యాప్తు చేస్తోంది. ఇదే కేసులో ఎన్ఎస్ఈ గ్రూపు మాజీ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణియన్‌ను ఫిబ్రవరి 25న సీబీఐ అరెస్ట్ చేసింది.