Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాపై ఆయన కుమారుడు బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వెలగపూడి వచ్చిన ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఎన్టీఆర్ బయోపిక్ కు చాలా మంది చాలా పేర్లు సూచించారని, ఎన్టీఆర్ అన్న పదానికి మించిన పేరు ఉండదన్న ఉద్దేశంతో చివరకు సినిమాకు ఎన్టీఆర్ అనే టైటిల్ ఖరారుచేశామని తెలిపారు. ఈ నెల 29న హైదరాబాద్ లోని రామకృష్ణా సినీ స్టూడియోలో షూటింగ్ ప్రారంభమవుతుందని, సాధ్యమయినంత త్వరగా చిత్రం పూర్తిచేస్తామని చెప్పారు. వచ్చే సంక్రాంతి నాటికి చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు.
ఎన్టీఆర్ సినిమా ఎన్నికల సందర్భంగా తీస్తున్నది కాదని, ఎన్నికలకు, రాజకీయాలకు, సినిమాకు సంబంధం లేదని వ్యాఖ్యానించారు. పార్టీలకు అతీతంగా ప్రతిఒక్కరూ ఎన్టీఆర్ ను ఆదరించి, అభిమానించారన్నారు. ఇటీవల తన చేతికి శస్త్ర చికిత్స చేయించుకున్న బాలకృష్ణ కట్టుతోనే అసెంబ్లీ సమావేశాలకు రావడంతో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన్ను పరామర్శించారు. గాయం ఎప్పుడు మానుతుందని కొందరు ప్రశ్నించగా… తాను ఎన్నో దెబ్బలు తిన్నానని… ఇదేమీ పెద్ద దెబ్బ కాదని, దీన్ని తాను లెక్కచేయడం లేదని తనదైన శైలిలో బాలకృష్ణ సమాధానమిచ్చారు. సినిమా షూటింగుల్లో గాయపడడం సాధారణమేనని, వాటిగురంచి తాను పట్టించుకోనని అన్నారు. ఈ నెల 31నుంచి రెండురోజులపాటు లేపాక్షి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని, హంద్రీనీవా సుజలస్రవంతికి జలహారతి ఇచ్చి ఉత్సవాలు ప్రారంభిస్తామని బాలకృష్ణ తెలిపారు.