పార్లమెంట్‌ సాక్షిగా అబద్ధం చెప్పిన నుస్రత్‌ జహాన్‌

పార్లమెంట్‌ సాక్షిగా అబద్ధం చెప్పిన నుస్రత్‌ జహాన్‌

టీఎంసీ ఎంపీ నుస్రత్‌ జహాన్‌ తన వివాహంపై చేసిన ప్రకటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నిఖిల్‌ జైన్‌తో తన వివాహం టర్కిష్‌ చట్టం ప్రకారం జరిగిందని, ఈ వివాహం భారత్‌లో చెల్లదన్నారు. అసలు తమది వివాహమే కాదని.. సహజీవనం కిందకు వస్తుందని ప్రకటనలో తెలిపారు. దీనిపై బీజేపీ విమర్శల వర్షం కురిపిస్తుంది. వివాహం విషయంలో నుస్రత్‌ పార్లమెంట్‌ సాక్షిగా అబద్ధం చెప్పారని విమర్శిస్తున్నారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు అమిత్‌ మాల్వియా ‘‘నుస్రత్‌ జహాన్‌ వ్యక్తిగత జీవితం గురించి, ఆమె ఎవరిని వివాహం చేసుకున్నారు.. ఎవరితో కలిసి ఉంటున్నారనే దాని గురించి మేం మాట్లాడటం లేదు. కానీ ఆమె ప్రజలు ఎన్నుకొన్న ఓ ప్రజాప్రతినిధి. పార్లమెంట్‌ రికార్డుల్లో ఆమె నిఖిల్‌ జైన్‌ను వివాహం చేసుకున్నట్లు ఉంది. అంటే ఆమె పార్లమెంట్‌ సాక్షిగా అబద్ధం చెప్పారా’’ అని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి వీడియోను ట్వీట్‌ చేశారు.

భారత చట్టాల ప్రకారం తనకు జరిగిన వివాహం ఇండియాలో చెల్లుబాటు కాదన్నారు నుస్రత్‌ జహాన్‌. నిఖిల్‌ జైన్‌తో జరిగిన మతాంతర వివాహానికి ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన ధ్రువీకరణ ఉండాలన్నారు. ఇక పోతే నిఖిల్‌ నుంచి చాలా కాలం క్రితమే విడిపోయినా, భారత చట్టాల ప్రకారం విడాకులు తీసుకునే ప్రశ్న తలెత్తదు అన్నారు. తనకు సంబంధించిన ఆభరణాలు, ఇతర వస్తువులు అక్రమంగా నిఖిల్‌ జైన్‌ కుటుంబ సభ్యులు లాగేసుకున్నారని ఆరోపించారు. అంతేకాకుండా తనకు చెందిన ఆస్తుల విషయంలో తన అభిప్రాయం తీసుకోకుండా తరలించారని వెల్లడించారు.