నూతన్‌ నాయుడుని అరెస్ట్‌ చేసిన పోలీసులు

నూతన్‌ నాయుడుని అరెస్ట్‌ చేసిన పోలీసులు

శిరోముండనం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పరాన్నజీవి దర్శకుడు నూతన్‌ కుమార్‌ నాయుడును పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేసు వెలుగుచూసినప్పటి నుంచి పరారీలో ఉన్న అతన్ని కర్ణాటకలోని ఉడిపిలో శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ముంబైకి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులకు పట్టుబడ్డాడని విశాఖ సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా వెల్లడించారు. శిరోముండనం కేసులో నూతన్‌ నాయుడు పాత్ర ఉందని తేలిన తరువాతనే అతన్ని అరెస్ట్‌ చేశామన్నారు.

దళిత యువకుడి శిరోముండనం కేసులో నూతన్‌ కుమార్‌ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురిపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మధుప్రియ సూచన మేరకే ఈ శిరోముండనం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇదివరకే ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. నిందితులకు న్యాయస్థానం రెండు వారాలు రిమాండ్‌ విధించింది.

తన మధుప్రియను భార్యను కేసు నుంచి తప్పించడానికి సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవి రమేష్ పేరిట నూతన్ నాయుడు పలువురు అధికారులకు ఫోన్‌చేసి మోసగించినట్టు పోలీసులు గుర్తించారు. శిరోమండనము ఘటనకు ముందు వెనుక నూతన్ నాయుడు భార్యతో వీడియో కాల్‌లో మాట్లాడినట్లు తేలింది. కేసు వివరాల ప్రకారం.. నూతన్‌నాయుడు ఇంట్లో పనిచేసి మానివేసిన దళిత యువకుడు వర్రి శ్రీకాంత్‌ను సెల్‌ఫోన్‌ పోయిందనే నెపంతో ఇంటికి పిలిపించి శిరోముండనం చేయడంతో పాటు దారుణంగా హింసించిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.