Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ధనా మాఝీ …పేదరికం ఎంత అమానవీయ పరిస్థితులను కల్పిస్తుందో గతేడాది ఈ వ్యక్తి ఎదుర్కొన్న అత్యంత దయనీయ స్థితి చూసి ప్రపంచం తెలుసుకుంది. ఒడిసాలోని కలహండి జిల్లాకు చెందిన ధనా మాఝీ భార్య ..పోయిన సంవత్సరం ఆగస్టులో అనారోగ్యానికి గురై కన్నుమూసింది. ఆమె మృతదేహాన్ని స్వగ్రామం తరలించేందుకు అంబులెన్స్ ఏర్పాటుచేయడానికి ఆస్పత్రి యాజమాన్యం నిరాకరించింది. ప్రయివేట్ అంబులెన్స్ లో తీసుకెళ్లే స్థోమత మాంఝీకి లేదు. దీంతో చేసేదేమీ లేక చివరికి తన భార్య మృతదేహాన్ని భుజంపై ఉంచుకుని 10కిలోమీటర్లు నడిచివెళ్లాడు. ఈ అమానవీయమైన ఘటనకు సంబంధించి వీడియో, ఫొటోలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అందరి మనసులను కలచివేశాయి. ఇది జరిగి ఏడాది దాటిపోయింది. అయితే మాఝీ పరిస్థితి మాత్రం మునపటిలా లేదు. ఆయన కటిక పేదరికం నుంచి బయటపడి మంచి జీవితం గడుపుతున్నారు. కుమార్తెలను బాగా చదివిస్తున్నారు. ఇల్లు కట్టుకుంటున్నారు.
ఖరీదైన బైక్ కొనుక్కున్నారు. మళ్లీ వివాహం కూడా చేసుకుని సంతోషకరమైన జీవితం గడుపుతున్నారు. దీనికి కారణం కొందరు చేసిన సాయం. మాఝీ దయనీయస్థితి వెలుగుచూసిన తర్వాత… ఒడిశా రాష్ట్రప్రభుత్వం, స్వచ్చంద సంస్థలతో పాటు బహ్రెయిన్ కూడా మాంఝీకి సాయం చేసింది. భార్య మృతదేహాన్ని భుజంపై ఉంచుకుని మాఝీ నడుస్తున్న ఫొటోలను భారత పత్రికల్లో చూసిన బహ్రెయిన్ రాజు, ప్రధానమంత్రి ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా ఆయనకు సాయం చేశారు. రూ. 9లక్షల చెక్కును మాఝీకి పంపించారు. ఆ డబ్బులతో మాఝీ పేదరికం నుంచి బయటపడ్డాడు.
పలు స్వచ్చంద సంస్థలు కూడా ఆయనకు సహాయం చేశాయి. ప్రధానమంత్రి గ్రామీణ్ ఆవాస్ యోజనా కింద అధికారులు ఆయనకు కొత్త ఇంటిని మంజూరుచేశారు. ప్రస్తుతం ఆ ఇల్లు నిర్మాణ దశలో ఉంది. సాయం కింద వచ్చిన డబ్బును కుమార్తెల పేరిట ఫిక్స్ డ్ డిపాజిట్ చేశాడు. ఆయన ముగ్గురు కుమార్తెలు ఓ విద్యాసంస్థ సాయంతో భువనేశ్వర్ లోని రెసిడెన్షియల్ స్కూల్ లో ఉచితంగా చదువుకుంటున్నారు. మాఝీ అలమతి దై అనే మహిళను మళ్లీ వివాహం కూడా చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె గర్భవతి. ఆయనకు ఉన్న కొంత పొలాన్ని సాగుచేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. తనకు సాయంగా అందిన డబ్బులో రూ. 65వేల రూపాయలతో హోండా బైక్ కూడా కొనుక్కున్నాడు. మాఝీ ఆ బైక్ పై ఉన్న ఫొటో, గత ఏడాది భార్య మృతదేహం భుజాన పెట్టుకుని ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సమాజం చేయూత అందిస్తే ఓ మనిషి జీవితం ఎలా మారిపోతుందో చెప్పడానికి మాఝీనే ఉదాహరణ.