మండల కేంద్రంలోని వృద్ధాశ్రమంలో ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆశ్రమ నిర్వాహకులు, పోలీసులు, అధికారుల కథనం ప్రకారం.. జమ్మికుంట మండలం కోరపల్లి పంచాయతీ పరిధి కాపులపల్లి గ్రామానికి చెందిన పోరెడ్డి అంకిరెడ్డి(77)కి యుక్త వయస్సులోనే వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య తగదాతో విడిపోయారు. అప్పటినుంచి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు. గ్రామంలో తన సోదరి కుమారులతో కలిసి జీవనం సాగించేవాడు. ఇంటివద్ద తనను సరిగా పట్టించుకునేవారు లేకపోవడంతో అల్లుళ్ల సహాయంతో మొదట కరీంనగర్‌లోని వృద్ధాశ్రమంలో కొద్ది రోజులు ఉన్నాడు. అనంతరం ఇల్లందకుంట మండల కేంద్రంలో రామసాయి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడంతో 2017లో చేరాడు.
సదరు ట్రస్ట్‌లో ఇటీవల ముగ్గురికి కరోనా సోకింది. దీంతో వృద్ధుల బంధువులకు నిర్వాహకులు సమచారం ఇచ్చారు. పీహెచ్సీలో పరీక్షలు చేయించారు. అంకిరెడ్డితో రూంలో ఉన్నవారు ఇంటికి వెళ్లిపోయారు. తనతో పాటు ఉన్నవారు ఇంటికి వెళ్లిపోవడంతో ఒంటరిగా ఉండలేక మనస్తాపం చెంది సోమవారం రాత్రి ఆశ్రమంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అంకిరెడ్డి ఆత్మహత్యకు ఆశ్రమ నిర్వాహకులే కారణమంటూ అఖిలపక్ష నాయకులు ఆశ్రమం ఎదుట ఆందోళన చేశారు. అయితే ఆశ్రమంలో కరోనా రావడంతో అందరి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని, అంకిరెడ్డి బంధువులకు సమాచారం ఇస్తే స్పందన లేదని, కొన్నిసార్లు ఫోన్ లిఫ్ట్ చేసి ఆశ్రమంలో నే ఉంచుకోవాలని, ఇక్కడ చూసుకునేవారు లేరని అన్నట్లు ఆశ్రమ నిర్వాహకుడు ముక్కా వెంకన్న పేర్కొన్నారు.
మూడురోజుల క్రితం వృద్ధాశ్రమంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు పరిశీలనకు వచ్చారు. వృద్ధులందరినీ ఇంటికి పంపిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇంటికి వెళ్తే తనను పట్టించుకునేవారు ఎవరూ లేరని, దీని కంటే నాకు చావు శరణ్యమని అక్క డే ఉన్న అంకిరెడ్డి విలపించాడు. తను అన్నట్టుగానే ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలచివేసింది. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్ తెలిపారు.