ఒలీవియా పాత్ర మరీ ఎక్కువ సేపు ఉండదట

ఒలీవియా పాత్ర మరీ ఎక్కువ సేపు ఉండదట

ఒలీవియా మోరిస్.. సోషల్ మీడియాలో నిన్నట్నుంచి మార్మోగిపోతున్న పేరిది. దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’లో జూనియర్ ఎన్టీఆర్ సరసన కథానాయికగా ఎంచుకున్న అమ్మాయి పేరిది. బ్రిటన్‌‌కు చెందిన ఈ అమ్మాయి థియేటర్ ఆర్టిస్ట్ అట. ఐతే ఎక్కడా సినిమాలు కానీ.. వెబ్ సిరీస్‌లు కానీ చేయని ఈ అమ్మాయికి అంతర్జాతీయ స్థాయిలో పెద్ద పేరేమీ లేదు.

ఒలీవియా వివరాలు తెలుసుకుందామంటే కనీసం వికీ పీడియా పేజీ కూడా లేకపోవడంతో తారక్ సరసన మరీ స్థాయి తక్కువ అమ్మాయిని కథానాయికగా పెట్టారంటూ తన అభిమానులు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఐతే ఏ పాత్రకు ఎవరు అవసరమో రాజమౌళికి తెలిసినంతగా ఎవరికి తెలుస్తుంది? కావాలని తారక్ రేంజ్ తగ్గించడానికి ఆయన ఆమెను ఎంచుకుంటాడా అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

చిత్ర వర్గాల సమాచారం ప్రకారం సినిమాలో ఒలీవియా పాత్ర మరీ ఎక్కువ సేపు ఉండదట. గరిష్టంగా 20 నిమిషాలు మాత్రమే ఆమె కనిపిస్తుందట. కొమరం భీంను ఇష్టపడే బ్రిటిష్ అమ్మాయిగా కనిపించే పాత్రకు నృత్యం తెలిసి ఉండాలట. ఒలీవియా మంచి డ్యాన్సర్ కావడం, ఆమె చేసిన నాటకల్లో నటన కూడా రాజమౌళిని ఆకట్టుకోవడం, పాత్రకు పక్కాగా సరిపోతుందని అనిపించడంతోనే ఆమెను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

ఆర్టిస్టుల నుంచి ఏం కావాలో అది రాబట్టుకుని చిన్న పాత్రల్ని కూడా తనదైన శైలిలో ఎలివేట్ చేయడంలో దిట్ట అయిన రాజమౌళి.. అన్నీ ఆలోచించుకునే ఒలీవియాను ఎంచుకుని ఉంటాడని భావించాల్సిందే. నిన్నటిదాకా ఒలీవియాకు పెద్ద పేరు లేకపోవచ్చు కానీ.. ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ అనగానే ఆమెకు కావాల్సినంత పాపులారిటీ వచ్చేసింది. గత 24 గంటల్లో గూగుల్లో అత్యధికమంది సెర్చ్ చేసిన పేరు ఇదే కావడం విశేషం. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఒలీవియా సినిమాలో జెన్నీ అనే పాత్రలో కనిపించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.