కోవిడ్-19 వైరస్ కొత్త వేరియెంట్ “ఒమిక్రాన్” వ్యాప్తి వేగంగా పెరుగుతున్న తరుణంలో దక్షిణ మధ్య రైల్వే శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. కరోనా థర్డ్ వేవ్ రావడానికి ముందే దాని వ్యాప్తిని అరికట్టడం కోసం ఇప్పటి నుంచే జాగ్రత్త చర్యలు తీసుకోవడం రైల్వే అధికారులు ప్రారంభించారు. ముఖ్యంగా దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకి పెరిగిపోవడంతో రైల్వేశాఖ అప్రమత్తమైంది. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులతో మనదేశంలో కూడా ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో కేంద్రం ఆదేశాల మేరకు రైల్వే శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కఠినమైన మార్గదర్శకాలను దక్షిణ మద్య రైల్వే శాఖ జారీ చేసింది.
ప్రతి రైల్వే కార్మికుడికి టీకాలు వేయడంతో పాటు మాస్క్ లేని వారికి రైల్వే స్టేషన్ల, రైళ్లలో ప్రవేశం లేదంటున్నారు అధికారులు. రైల్వే స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి రావాలని సూచిస్తున్నారు. ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. మాస్క్ లేకుండా రైల్వే స్టేషన్లోకి వస్తే 500 రూపాయలు జరిమానా విధించనున్నట్లు తెలిపారు. రైల్వే స్టేషన్లలో కొత్త ఆదేశాలు పాటించకుండా వెతికి పట్టుకొని మరి జరిమానా విధిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కొత్త రూల్స్ పట్ల ప్రయాణికులకు అవగాహన కోసం ప్రకటనల బోర్డ్స్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించాలని, కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలని సూచించారు.