బ్రిటన్‌లో ఒమిక్రాన్‌ విలయం

బ్రిటన్‌లో ఒమిక్రాన్‌ విలయం

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ దెబ్బకు ప్రపంచదేశాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. మిగతా వేవ్‌ల కంటే ఒమిక్రాన్‌ విస్తృత వేగంతో వ్యాపిస్తోంది. అమెరికా, బ్రిట‌న్‌, ఫ్రాన్స్, అమెరికా వంటి యూర‌ప్ దేశాల్లో ఒమిక్రాన్ పంజా విసురుతోంది.

ముఖ్యంగా బ్రిటన్‌లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే అధిక కేసులతో ఆ దేశం అతలాకుతలం అవుతోంది. తాజాగా రికార్డు స్థాయిలో లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వెలుగులోకి వచ్చినప్పటి నుంచి బ్రిటన్‌లో ఈ స్థాయిలో కరోనా కేసులు రావడం ఇదే తొలిసారి.

యూకేలో గడిచిన 24 గంటల్లో 106,122 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 13 వేలకు పైగానే ఉంది. ఇక ఇప్పటి వరకు యూకేలో మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 69 వేలు దాటినట్లు అక్కడి ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి.

కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మూడవ టీకా అంటే బూస్టర్ డోస్ తీసుకోవాలని యూకే ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. అదే విధంగా ఐదేళ్ల నుంచి 11 సంవత్సరాల పిల్లలకు కోవిడ్‌ టీకాను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ అభివృద్ధి చేసిన ఫైజర్‌ టీకాను పిల్లలకు అందించేందుకు బ్రిటిష్ రెగ్యులేటర్లు బుధవారం అంగీకరించారు.

కాగా ఐరోపా దేశాల్లో కరోనా విజృంభిస్తున్న దేశాల్లో బ్రిటన్‌ ముందు వరుసలో ఉంది. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు కోవిడ్ -19 కారణంగా 147,573 మంది మరణించారు. 11 మిలియన్ల మంది ప్రజలు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇప్పటివరకు 30 మిలియన్లకు పైగా ప్రజలు ఇక్కడ బూస్టర్ మోతాదులను తీసుకున్నారు. బ్రిటన్‌లో ఇప్పటివరకు 37,101 ఓమిక్రాన్ కేసులు నిర్ధారించారు.

ఇంతకముందు బ్రిటన్‌లో కోవిడ్‌ సెల్ఫ్‌ ఐసొలేషన్‌ సమయాన్ని పది రోజుల నుంచి ఏడు రోజులకు తగ్గించారు. క్వారంటైన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఆరు, ఏడు రోజుల్లో వరుసగా రెండు నెగిటివ్‌ ఫలితాలు వస్తే వారి క్వారంటైన్‌ను ఇక అక్కడితో ముగించేయవచ్చునని బ్రిటన్‌ ఆరోగ్య శాఖ కార్యదర్శి సాజిద్‌ జావిద్‌ బుధవారం తెలిపారు.