కరోనా మహమ్మారి పుట్టిన చైనాలో ఒమిక్రాన్ రెండోకేసు నమోదైంది. 67 ఏళ్ల వ్యక్తికి ఈ కొత్త వేరియంట్ సోకినట్టు చైనా అధికారిక మీడియా మంగళవారం తెలిపింది. నవంబర్ 27న విదేశాల నుంచి గ్వాంగ్జౌ వచ్చిన సదరు వ్యక్తికి తొలుత పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చిందని, రెండు వారాల క్వారంటైన్ అనంతరం పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తెలిపింది. ఆ ఫలితాలను మరింత లోతుగా అధ్యయనం చేయగా ఒమిక్రాన్‌గా తేలిందని చైనా మీడియా వెల్లడించింది. ఇప్పటికే డెల్టా ప్రభావంతో వణికిపోతున్న చైనాలో తాజాగా ఒమిక్రాన్ కేసులు వెలుగు చూడడం అధికార వర్గాలను కలవరపెడుతోంది.
చైనాలో సోమవారం తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. టియాంజిన్ నగరంలో ఒమిక్రాన్ కేసు వెలుగు చూసినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. యూరప్ నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో ఈ వేరియంట్‌ను గుర్తించినట్లు ప్రకటించారు. అయితే, ఆ వ్యక్తి ఏ దేశానికి చెందినవాడు అనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఆయనలో ఎటువంటి లక్షణాలూ లేవని, ప్రస్తుతం ఆయన్ను ఐసోలేషన్‌లో ఉంచి పరీక్షిస్తున్నామని చైనా అధికారులు తెలిపారు.