భారత్‌లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరో 156 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూడటంతో మొత్తం కేసుల సంఖ్య 578కి చేరింది. బాధితుల్లో 151 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ సోమవారం నాటి బులెటిన్‌లో పేర్కొంది. దేశంలోని 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ వేరియంట్ వ్యాప్తి చెందింది.
ఇక అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్రను దాటి ఢిల్లీ తొలిస్థానానికి చేరింది. దేశరాజధానిలో ఒక్కరోజే 63 కొత్త ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. ఢిల్లీలో 142 మందికి ఈ వేరియంట్ సోకగా.. మహారాష్ట్రలో 141, కేరళలో 57, గుజరాత్‌లో 49, రాజస్థాన్‌లో 43 కేసులు ఉన్నట్టు ఆరోగ్య సంక్షేమ శాఖ వెల్లడించింది. ఢిల్లీలో సోమవారం రాత్రి 11 గంటల నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుంది. కేసులు పెరిగితే మరిన్ని ఆంక్షలు అమలుచేసేందుకు కేజ్రీవాల్ సర్కార్ ప్రణాళిక సిద్ధంచేసింది.